పైన చూస్తున్న ఈయన ఇప్పుడు రోడ్లపైనే బిచ్చమెత్తుకుంటూ బతుకుతున్నాడు. కానీ ఒకప్పుడు ఈయన ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్. భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లల్ని బాగానే చదివించాడు. ఆస్తులు కూడా బాగానే కూడబెట్టాడు. అంతాబాగానే ఉంది కానీ ఆ ఆస్తులు పిల్లల్ని నమ్మి వారి పేరుమీద రాశాడు. అదే ఆయన్ని రోడ్డుపైన పడేసింది.
జయపురం సమితి వ్యవసాయ కార్యాలయంలో ఉద్యోగం చేసిన లక్ష్మీకాంత్ పట్టణంలో సూర్యమహాల్ సమీపంలో ఉండేవాడు. వ్యక్తిగత కారణాలతో ఉద్యోగ విరమణకు ఆరేళ్లు గడువు ఉండగానే రాజీనామా చేశాడు. ఏమైందో ఏమో కానీ మనస్థాపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి ఖుర్దాలో ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. అయితే ఇటీవల ఆశ్రమాన్ని పునర్మిస్తామని చెప్పి ఖాళీ చేయించడంతో అక్కడ నుంచి జయపురానికి వచ్చాడు.
అక్కడ తన ఇంటికి వెళ్తే..తన భార్య లక్ష్మీకాంత్ చనిపోయాడని బొట్టు తీసేయడం, కుమారులు, కుమార్తెలు అతడి పట్ల కటువుగా ప్రవర్తించడంతో మరింత కృంగిపోయాడు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక.. స్థానిక రాజ్‌మహల్ వద్ద ఉన్న విక్రమ్‌దేవ్ మహారాజా విగ్రహం వద్ద తలదాచుకుంటూ బిచ్చమెత్తుకుంటున్నాడు. అక్కడికి వచ్చి వెళ్లేవారికి మనం చచ్చే వరకు ఆస్తులు పిల్లల పేర్ల మీద రాయోద్దంటూ చెబుతున్నాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈవో సిద్ధార్థ్ లక్ష్మీకాంత్ వద్దకు వెళ్లి ఆశ్రమానికి తరలించారు. లక్ష్మీకాంత్ బాగోగులు తాము చూసుకుంటామని వెల్లడించారు.