మరికల్, వెలుగు: ఇథనాల్ కంపెనీ మూసి వేయాలని రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ కోరారు. మండలంలోని చిత్తనూర్ వద్ద ఉన్న ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 100 రోజులుగా నిరవధిక రిలే దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఎక్లాస్పూర్ స్టేజీ వద్ద మహాధర్నా నిర్వహించారు. జస్టిస్చంద్రకుమార్, రిటైర్డ్ సైంటిస్ట్ డా.కలపాల బాబురావు హాజరయ్యారు. కంపెనీ కోసం రోజుకు 18 లక్షల కిలోల బియ్యం, 30 లక్షల లీటర్ల నీళ్లు వాడుకోవడంతో 40 లక్షల లీటర్ల విష పదార్థాలు బయటకు వస్తాయన్నారు.
వీటి ద్వారా వచ్చే కాలుష్యాన్ని పక్కనే ఉన్న మన్నెవాగులోకి వదలడంతో ఆ నీళ్లు కృష్ణానదిలో కలుస్తున్నాయన్నారు. ఇథనాల్ కంపెనీ మూతపడే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. కేవై రత్నం, చోలేటి ప్రభాకర్, రామారావు, రాఘవచారి, నాగార్జున, డి.చంద్రశేఖర్, ఎం.వెంకట్రాములు, చక్రవర్తి, సుదర్శన్ పాల్గొన్నారు.