జన్నారం, వెలుగు: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని గతంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపకుడు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జన్నారం మండలంలోని రేండ్లగూడలో రైతు సంక్షేమ సమితి ప్రెసిడెంట్ అల్లం లచ్చన్న ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. నకలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
నకిలీ విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. పంటలు నిల్వచేసేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 1న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు సదస్సుకు మండలంలోని రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరారు. కార్యక్రమంలో రేండ్లగూడ మాజీ సర్పంచ్ సుభాష్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు లచ్చన్న, ఇంద్రసేన వెంకటరెడ్డి, పవన్ కుమార్, మామిడి విజయ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.