
- బాల్క సుమన్ కూడా కేసీఆర్ బాటలోనే
- కమిషన్ కోసమే చెన్నూరు ఎత్తిపోతల పథకం
- జాగో తెలంగాణ యాత్రలో ఆకునూరి మురళి
మంచిర్యాల: అమరవీరుల ఆత్మబలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో అవినీతి, నియంతృత్వ, అరాచక పరిపాలన సాగుతోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న బీఆర్ఎస్ సర్కారును గద్దె దించి.. కేసీఆర్ ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. జాగో తెలంగాణ ఓటర్ చైతన్య బస్సు యాత్రలో భాగంగా.. గురువారం ఆయన చెన్నూరు పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణను కేసీఆర్ ఆగం చేశాడు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, దళితులకు భూములంటూ హామీలిచ్చి.. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశాడు. రాష్ట్రంలో విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారాయి. తెలంగాణలో 34 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్స్ పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఈ సర్కారు చెలగాటమాడుతోంది.
ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కమీషన్లు దోచుకున్నాడు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం కేసీఆర్ బాటలోనే అవినీతి, అక్రమాలకు, అణిచివేతకు పాల్పడుతూ ప్రజలను పీడిస్తున్నాడు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవినీతి పాలనను అంతమొందించాలి. అని ఆకునూరి మురళి మండిపడ్డారు. కమిషన్ కోసమే చెన్నూరు ఎత్తిపోతల పథకాన్నిరూ.1600 కోట్ల తో బాల్క సుమన్ తీసుకువచ్చాడని ఆరోపించారు.