ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర : ఆకునూరి మురళి

 రాష్ట్ర ప్రభుత్వం  ఉపాధి హామీ పథకం నిధులను దుర్వినియోగం చేస్తుందని  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. ఉపాధి హామీ పథకం  నిధులను ప్రభుత్వం హరితహారానికి బదలాయిస్తూ  పేదల పొట్టగొడుతుందని మండిపడ్డారు.  హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉపాధి హామీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలో 10 కోట్ల మంది పేదలు లబ్దిపొందుతున్న ఉపాధి హామీపధకాన్ని నిరుగారుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల వ్యతిరేక ప్రభుత్వాలుగా మారాయని అన్నారు.

 గత బడ్జెట్ లో  కేంద్రం ఉపాధి హామీ కోసం 89 వేల కోట్లు కేటాయిస్తే... ఈ బడ్జెట్ లో కేవలం రూ.60 వేల కోట్లకు తగ్గించిందని ఆకునూరి మురళి విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  నిర్వీర్యం చేసే కుట్ర  చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.