నిజామాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే కామెంట్లతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రధాని మోదీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని రిటైర్డ్ ఐఏఎస్అధికారి ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం జాగో తెలంగాణ, రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) బస్సు యాత్ర నిజామాబాద్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఐటీఐ కాలేజీ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్‌ను ఉద్దేశించి కోటగల్లి, బస్టాండ్‌లో ఆయన మాట్లాడారు. దేశ సహజ సంపదను బడాపారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసిన మోదీని గద్దె దించాలన్నారు.
ఓటర్ చైతన్యం కోసం రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నారన్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల నుంచి ట్యాక్స్‌ల రూపంలో రూ.12 లక్షల కోట్లను దోచుకొని రూ.16 లక్షల కోట్ల సొమ్మును అదానీ, అంబానీకంపెనీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఏటా రెండు కోట్ల జాబ్స్, బ్లాక్ మనీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామనే హామీ ఎక్కడపోయిందని ప్రశ్నించారు. బీసీ గణన మరిచారన్నారు. ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ పద్మజ, ప్రజాపంథా నేత ఆకుల పాపయ్య, న్యూడెమోక్రసీ లీడర్లు శంకర్ తదితరులున్నారు.
ఆకునూరి ప్రసంగాన్ని అడ్డుకున్న వాకర్స్
ఐటీఐ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్‌ను ఉద్దేశించి ఆకునూరి మురళి ప్రసంగిస్తుండగా అక్కడున్న పౌరులు ఆయన్ను అడ్డుకున్నారు. ప్రధాని మోదీని ఎందుకు టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారని ప్రశ్నించారు. మోదీకి ఓటేయొద్దని ప్రచారం చేయడం బాగోలేదని అన్నారు. తాము ఫలానా వారికి ఓటేయని చెప్పడం లేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మార్నింగ్ వాకర్స్ మోదీకి అనుకూలంగా నినాదాలు చేయగా ఆకునూరి మురళితో ఉన్న నేతలు వ్యతిరేక స్లోగన్స్ఇచ్చి వెళ్లిపోయారు.