కులగణనపై రీ సర్వే అభినందనీయం : రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు

కులగణనపై రీ సర్వే అభినందనీయం : రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
  • గతంలో వివరాలు ఇవ్వనోళ్లు రీ సర్వేలో ఇవ్వండి: రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ చిరంజీవులు
  • చాలా ఏండ్ల తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వస్తున్నయి
  • బీసీల రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణకు బీజేపీ నేతలు కృషి చేయాలని డిమాండ్‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం రీ సర్వే చేయడం అభినందనీయమని బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు.కులగణన లెక్కలపై బీసీ సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేపడుతుండటం ఆనందంగా ఉందన్నారు. రాజకీయ పార్టీలు కుల గణన అంశాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా, సర్వేలో పాల్గొనాలని కోరారు. గురువారం హైదరాబాద్‌‌ లక్డీకాపూల్‌‌లోని ఓ హోటల్‌‌లో బీసీ సంఘాల నేతలతో కలిసి చిరంజీవులు మీడియాతో మాట్లాడారు. 

చాలా ఏండ్ల తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌‌లో బీసీ బిల్లు పెట్టి, రాజ్యాంగ సవరణ చేసేలా రాష్ట్ర బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్‌‌ చేశారు. గత లోక్‌‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కుల గణన అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లారని గుర్తుచేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన 6 నెలలో కుల గణన చేపడతామని హామీ ఇచ్చి, కాంగ్రెస్‌‌ నిలబెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కుల గణన సర్వేలో 21 లక్షల 50 వేలు బీసీ జనాభా తగ్గించి, ఓసీ జనాభాను పెంచి చూపించారన్నారు. బీసీ జనాభాను తగ్గించటం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం ఉండదని, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోత పడుతుందని తెలిపారు. 

సర్వేలో కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ పాల్గొనాలి: ‌‌‌‌జాజుల శ్రీనివాస్ గౌడ్

మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే కేటీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌తో పాటు చాలా మంది ప్రజా ప్రతినిధులు కుల గణన సర్వేలో పాల్గొనలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ అన్నారు. సర్వేకు ప్రభుత్వం మళ్లీ అవకాశం ఇచ్చినందున ఇప్పుడైనా వివరాలు ఇవ్వాలని కోరారు. బండి సంజయ్ కుల గణనపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ సీఎంగా ఆయనకు కూడా అవకాశం ఉంటుందని, బీసీల లెక్కలు తేలితేనే రాజకీయ అవకాశాలు వస్తాయని తెలిపారు. మార్చి 9న ఛలో హైదరాబాద్ పిలుపును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 22 వరకు రీ సర్వేకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, అయితే, పరీక్షలు ఉన్నందున వచ్చే నెల 2 వరకు అవకాశం ఇవ్వాలన్నారు. రీ సర్వేపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు బీసీ సంఘాల తరుఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేసి, ప్రధాని మోదీని కలిసి చట్టబద్ధత కల్పించాలని కోరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. అలాగే, స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తే, అందుకూ ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. బీసీ మేధావులు, కుల సంఘాల సూచనలను ప్రభుత్వం గౌరవించి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. కులగణనలో బీసీ జనాభాను 5 శాతం తగ్గించి చూపించారని, దీంతో బీసీ సమాజం ఆందోళనలు స్టార్ట్ చేయడంతో ప్రభుత్వం రీ సర్వేకు అవకాశం ఇచ్చిందని బీసీ రాజ్యాధికార సమితి ప్రెసిడెంట్ దాసు సురేశ్‌‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.