
ఇప్పటి మెంబర్ విఠల్ కూడా తీవ్ర ప్రయత్నాలు
మెంబర్ పోస్టులపై టీఆర్ఎస్, ఉద్యోగ సంఘాల నేతల ఫోకస్
17న చైర్మన్ ఘంటా, ముగ్గురు మెంబర్లు రిటైర్
ఖాళీల భర్తీపై సర్కార్ కసరత్తు షురూ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) చైర్మన్, మెంబర్ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ప్రస్తుత చైర్మన్ ఘంటా చక్రపాణి, మెంబర్లు సి. విఠల్, బి. చంద్రావతి, మహ్మద్ ఖాద్రీ పదవీకాలం ఈ నెల17తో ముగియనుంది. మరో ఇద్దరు మెంబర్లు ప్రొఫెసర్ సాయిలు చింతా, డి. కృష్ణారెడ్డి పదవీకాలం మాత్రమే ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న చైర్మన్, మెంబర్ పోస్టుల్లో కొత్తవారిని నియమించడంపై సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆశావహుల లిస్టును తెప్పించుకుని ప్రగతిభవన్ వర్గాలు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. లిస్టులో రాజకీయ నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు ఉన్నట్టు సమాచారం. టీఎస్ పీఎస్సీ చైర్మన్, మెంబర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేయడంతో నియామక ప్రక్రియ షురూ అయింది. దీంతో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి మెంబర్ విఠల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఇంకా హామీ లభించలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ మధ్యనే రిటైర్ అయినోళ్లు..
చైర్మన్ పదవి కోసం రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎస్ పదవి కోసం సీరియస్ గా ట్రై చేసి ఫెయిల్ అయిన ఐఏఎస్ అజయ్ మిశ్రా ఆరు నెలల క్రితం రిటైర్ అయ్యారు. ఆయనకు సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇప్పించేందుకు ఓ ప్రభుత్వ సలహాదారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మధ్య రిటైర్ అయిన ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్ కూడా రేసులో ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
ఉద్యోగ సంఘాల నేతలూ..
టీఎస్ పీఎస్సీ మెంబర్ పదవి కోసం కొందరు టీఆర్ఎస్ లీడర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మధ్య రిటైర్ అయిన తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పద్మాచారి, టీఎన్జీవో నేత కారం రవీందర్ రెడ్డి కూడా ఈ లిస్టులో ఉన్నట్టు చెప్తున్నారు. అయితే కారం రవీందర్ రెడ్డి బీజేపీలో చేరే చాన్స్ ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తునట్టు తెలిసింది.
యూపీఎస్సీ మెంబర్‌గా ఘంటా చక్రపాణి?
టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా రిటైర్ అవుతున్న ఘంటా చక్రపాణికి ప్రమోషన్ దక్కే చాన్స్ ఉన్నట్టు తెలిసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ పోస్టులో నియామకం కోసం ఆయన పేరును కేంద్రం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి యూపీఎస్సీ మెంబర్లుగా ఎవరూ లేరు. ఆరేళ్లపాటు రాష్ట్ర కమిషన్ చైర్మన్ గా పనిచేయడం చక్రపాణికి కలిసి వచ్చే అంశంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
For More News..