- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి
హనుమకొండ, వెలుగు : బీజేపీ పదేండ్ల పాలనలో విద్యారంగం పూర్తిగా విధ్వంసానికి గురైందని, ఫలితంగా దళిత, గిరిజన, ముస్లిం మైనారిటీ వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కేయూ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ బిల్డింగ్‌లో నిర్వహించిన వామపక్ష , బహుజన విద్యార్థి సంఘాల సమావేశానికి చీఫ్‌గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రదాని మోదీకి అదానీ, అంబానీ లాంటి ప్రైవేట్, కార్పొరేట్ల శక్తుల అభివృద్ధి పట్ల ఉన్న శ్రద్ధ ప్రభుత్వ విద్యారంగంపై లేదని విమర్శించారు.
దేశంలోని యువతకు విద్య, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానం-–2020 విద్యా వ్యవస్థను కాషాయీకరించేలా ఉందని ఆరోపించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం కొరవడి, కుల, మత విద్వేషాలు రగిలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచన చేయాలని, ప్రశ్నించే తత్వాన్ని, ప్రజాస్వామిక లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. విద్యా రంగాన్ని పరిరక్షించుకోవడానికి వామపక్ష, బహుజన విద్యార్థి, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ పద్మజాషా, సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర నాయకులు పృథ్వీరాజ్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి పి.మహేశ్, ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీల ఇన్‌చార్జి రహమాన్, పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి బి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.