గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్

గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.  తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ సమావేశం.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ..  టెన్త్, ఇంటర్ ఫలితాల్లో గు‌రుకులాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల అభివృద్ధికి  గురుకులాలు ఎంతో తోడ్పడుతున్నాయని వెల్లడించారు. 

విజినరీ గురుకుల అల్యూమిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరమశివ చొక్కాలింగం మాట్లాడుతూ.. గురుకులాల్లో సౌలతుల కల్పనకు, విద్యాప్రమాణాల మెరుగుదలకు పూర్వ విద్యార్థులుగా తాము శాయాశక్తులా కృషి చేస్తామన్నారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బొల్లరాజు మాట్లాడుతూ...గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. 

ఈ సందర్భంగా వంద శాతం ఉత్తీర్ణత సాధించిన వివిధ సొసైటీ గురుకులాల ప్రిన్సిపాల్స్ ని సన్మానించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జాటోతు హరికిషన్, డాక్టర్ విజయానంద్, డాక్టర్ చంద్రకాంత్, గౌతమ్ రెడ్డి, శ్రీకాంత్, నీరజ,  నీలిమ,  శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.