విశ్లేషణ: కోర్టుల సెలవులను తగ్గించాలె

కోర్టుల్లో పనిభారం ఎక్కువ. అదేవిధంగా కోర్టులకు సెలవులు కూడా ఎక్కువే. ఈ సెలవులను తగ్గించాలన్న చర్చ చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. కానీ ఈ తగ్గింపు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. మనదేశంలోని అన్ని కోర్టుల్లో కలిపి సుమారు 3.1 కోట్ల కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయని ఒక అంచనా. ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు మూతపడటం వల్ల కూడా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కోర్టు సెలవులు తగ్గించాలనే డిమాండ్​తో సుప్రీంకోర్టులో గతంలో ఒక పిటిషన్​ కూడా దాఖలు అయ్యింది. ఏడాదికి 225 రోజులు సుప్రీంకోర్టు పని చేయాలని, రోజుకు 6 గంటలు పని జరగాలని పిటిషనర్​ ఆ దరఖాస్తులో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. కానీ ఇంతవరకూ ఆ కేసు ఏమైందో తెలియదు.

కోర్టుల సెలవులపై ఎంతో చర్చ
కోర్టుల్లో తీర్పులు సకాలంలో రాకపోవడానికి కారణం – కోర్టులకు సెలవులు ఎక్కువగా ఉండటమే అన్న చర్చ కూడా చాలా రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. కోర్టులకు వేసవి సెలవులు, శీతాకాలం సెలవులతో పాటూ పండుగ సెలవులు సరే సరి. కోర్టులు వారానికి పని చేసేది ఐదు రోజులే. ఇక జాతీయ సెలవు రోజులు ఉండనే ఉన్నాయి. 2013లో సుప్రీంకోర్టుకు ఉన్న 10 వారాల సెలవు రోజులను 7 వారాలకు కుదించారు. సుప్రీంకోర్టు ఏడాదికి 193 రోజులు, హైకోర్టులు 210 రోజులు, కింది కోర్టులు 245 రోజులు పనిచేస్తున్నాయని అప్పుడు గుర్తించారు. కోర్టులకు సెలవులు ఉన్నప్పుడు వెకేషన్‌‌ బెంచీలు ఉంటాయి. అయితే అవి అత్యవసర కేసులను మాత్రమే విచారణకు స్వీకరిస్తాయి. వాటి ప్రభావం చాలా తక్కువ. సుదీర్ఘ సెలవులు అనేవి వలస దేశాల ప్రభావమని, వీటిని ఇంకా కొనసాగించడం సరైంది కాదని చాలామంది భావన. లా కమిషన్, అదే విధంగా పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీలు కోర్టుల పనిదినాలు పెంచాలని సిఫార్సులు చేశాయి. ఈ సిఫార్సులను కొంతమంది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్‌‌ ఆర్‌‌ఎం లోధా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏడాది పొడుగునా సుప్రీంకోర్టు పని చేయాలని, న్యాయమూర్తి తమ అవసరాలు ఉన్నప్పుడు సెలవులు పెట్టుకోవచ్చని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన గురించి బార్‌‌‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్​ ఇండియాతో పాటు మిగతా భాగస్వాములతోనూ చర్చించారు. ఈ ప్రతిపాదనకు పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు.

జడ్జిగా చేయాల్సిన.. చేయకూడని పనులు
మనదేశంలో న్యాయమూర్తుల సంఖ్య జనాభాలో పోలిస్తే చాలా తక్కువ. మిలియన్‌‌ జనాభాకు మనదేశంలో 13 మంది న్యాయమూర్తులు ఉంటే అమెరికా లాంటి దేశాల్లో 130 మంది జడ్జీలు ఉన్నారు. అయినా కూడా సుదీర్ఘ సెలవులను అమెరికా రద్దు చేసింది. మనదేశంలో సెలవులు ఎక్కువ కాబట్టి జడ్జీలు తమ వ్యక్తిగత సెలవులను అరుదుగా ఉపయోగించారని అంటూ ఉంటారు. కానీ, వాస్తవానికి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు దేశంలోని వాతావరణాన్ని గమనిస్తే, అదే సెలవుల వాడకాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కంటే ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్‌‌ ఆర్​.సి.లాహాటి ‘న్యాయప్రవర్తన’ గురించి, యు.సి.సెచల్‌‌వాడ్​ స్మారక ఉపన్యాసంలో సెలవుల గురించి మధ్యప్రదేశ్​, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జీజీ సోహాన్‌‌ చెప్పిన విషయాలను ఉదహరించారు.

ఆయన మాటల్లో.. ‘‘నేను హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా ఆత్మీయంగా ఆయన నాకు ఈ సలహా ఇచ్చారు. న్యాయమూర్తిగా చేయాల్సిన, చేయకూడని పనులను ఆయన నాకు వివరించారు. అందులో ముఖ్యమైనవి: కోర్టు సమయాన్ని జ్యుడీషియల్‌‌ పనికే ఉపయోగించాలి. ఈ సమయాన్ని పరిపాలనా పని కోసం వినియోగించకూడదు. ఫుల్‌‌ కోర్టు, అదే విధంగా పరిపాలనా కమిటీల మీటింగ్​లు పని దినాల్లో కాకుండా వేరే రోజుల్లో నిర్వహించాలి. అలా కానప్పుడు కోర్టు పని సమయం అయిపోయిన తర్వాత ఆ సమయాన్ని ఆ పనుల కోసం కేటాయించాలి. మరో ముఖ్యమైన అంశం – అత్యవసరం అయితే తప్ప జడ్జీలు సెలవు పెట్టకూడదు. తప్పనిసరైతే తప్ప సెలవులు పెట్టకూడదు. కోర్టు పనులను పక్కన పెట్టి ప్రారంభోత్సవాలకు, ఉపన్యాసాలు ఇవ్వడానికి, లెక్చర్స్‌‌ ఇవ్వడానికి వెళ్లకూడదు. అంటే న్యాయమూర్తి రిలాక్స్‌‌ కాకూడదని నా ఉద్దేశం కాదు. కోర్టు సెలవులప్పుడు వాళ్లు రిలాక్స్‌‌ కావాలి. చైతన్యవంతులు కావాలి. తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. తమ న్యాయ పరిజ్ఞానాన్ని డెవలప్​ చేసుకోవాలి. తమ కుటుంబ సభ్యులకు కూడా రోజూ సరైన సమయాన్ని కేటాయించాలి. దానివల్ల కోర్టు సమయంలో జ్యుడీషియల్‌‌ పని మీద వారు దృష్టిని కేంద్రీకరించడానికి వీలు కలుగుతుంది. ఈ సలహాని నేను న్యాయ పరివర్తనగా భావిస్తాను’’ అని చెప్పారు.

వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలి
వ్యక్తిగత సెలవులను అతి తక్కువగా ఉపయోగించుకున్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులూ ఉన్నారు. మిగతా న్యాయమూర్తులు 
వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలి. చిన్న చిన్న మీటింగ్‌‌ల కోసం సెలవులు తీసుకోవడం మానేసి న్యాయమూర్తులు కింది కోర్టు న్యాయమూర్తులకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గొప్ప వ్యక్తులు గొప్పగా జీవిస్తారు. కాలమనే ఇసుక మీద వాళ్లు వేసిన పాదముద్రలు ఎంతమంది నడిచినా, ఎంత గాలి వీచినా చెరిగిపోవు. ఆ దారిలో అందరూ నడవాల్సిన అవసరం ఉంది.

- మంగారి రాజేందర్, రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి