బహుమతులు లంచాలా?

జిల్లా కోర్టుల్లో పని చేసే న్యాయమూర్తులకు, సిబ్బందికి కాండక్ట్​ రూల్స్​ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అలాంటి కాండక్ట్​ రూల్స్ ​లేవు. అందుకని సుప్రీంకోర్టు 1997 మే 7న ఫుల్​కోర్టు మీటింగ్‌లో ఓ చార్టర్​ను ఆమోదించింది. దాని పేరు ‘న్యాయ జీవితంలోని విలువల ప్రకటన’. ఈ చార్టర్​ న్యాయమూర్తులకు మార్గదర్శకంగా ఉంటుందని సుప్రీంకోర్టు భావించింది. న్యాయవ్యవస్థ బలంగా, స్వతంత్రంగా ఉండటానికి, నిష్పక్షపాతంగా పనిచేయడానికి ఈ చార్టర్ ​ఉపయోగపడుతుంది. దీనిని ఆమోదించడానికి ముందుగా తయారుచేసిన ముసాయిదా ప్రతిని దేశంలోని అన్ని హైకోర్టులకు పంపించి, వారి సూచనల ప్రకారం అవసరమైన మార్పులు చేసి సుప్రీంకోర్టు ఫుల్​ బెంచ్​ ఆమోదించింది. ఇవి సంపూర్ణమైనవి కావు. కానీ వివరణాత్మకమైనవి. ఈ చార్టర్​ని 1999వ సంవత్సరంలో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ధ్రువపరిచారు.

బహుమతికి, లంచాలకి భేదం ఉంది. బహుమతులను కొన్నిసార్లు వద్దనలేని పరిస్థితి ఉంటుంది. లంచం అనేది ఎప్పుడూ నిషిద్ధమే. అయితే న్యాయమూర్తులు ఖరీదైన బహుమతులను స్వీకరించకూడదు. న్యాయమూర్తుల న్యాయనడవడిక గురించి న్యాయమూర్తులు ఏర్పాటు చేసుకున్న నియమాలలోని 4.16 నియమం ప్రకారం లాంఛన ప్రాయమైన బహుమతులని స్వీకరించవచ్చు. అయితే అది కూడా చట్టవ్యతిరేకంగా ఉండకూడదు. చాలా ఖరీదైన మెమెంటోలని న్యాయమూర్తులు స్వీకరిస్తున్న ఫొటోలు తరచూ పత్రికల్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైనా సదస్సు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఖరీదైన బహుమతులను ఇస్తున్నాయని కూడా వింటున్నాం. కొంతమంది న్యాయమూర్తులు వాటిని తిప్పి పంపిస్తున్నారని కూడా వింటున్నాం. పెద్దవాళ్లు అంటే సీనియర్ న్యాయమూర్తులు ఖరీదైన బహుమతులు తీసుకోవడం తరచూ జరగడం వల్ల ఇదో ఆనవాయితీగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ బహుమతులనేవి అవినీతి కాదు. కానీ వీటి ప్రభావం పరోక్షంగా ఉండే అవకాశం ఉంది.

కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పందిస్తూ..

జవాన్లు, జమాదార్లు టిప్పులు అడగటం మామూలే. అయితే ఈ రాజేంద్రకుమార్​అనే జమాదార్ ​సాంకేతికతను వాడుకోవడమే కాదు. ప్రదర్శించాడు కూడా. అందువల్ల అతను ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. న్యాయవ్యవస్థలో అవినీతి అన్న ప్రస్తావన ఓ నాలుగు మాసాల క్రితం పార్లమెంట్​లో చర్చకు వచ్చింది. ఈ ప్రశ్నకి జవాబు చెబుతూ కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్​రిజీజు ఇలా అన్నారు. “న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి విచారించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థ స్వతంత్రమైనది. ఈ అవినీతి సమస్యను ఆ వ్యవస్థ తన అంతర్గత ప్రక్రియల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అత్యున్నత న్యాయవ్యవస్థలో జవాబుదారితనం గురించి 1997 మే 7న ఫుల్​ బెంచ్​ సమావేశంలో సుప్రీంకోర్టు ఆమోదించిన ‘ఇన్​హౌస్​ ప్రొసీజర్’ ద్వారా చర్యలు తీసుకుంటారు. ఈ ప్రొసీజర్ ​ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి ఫిర్యాదులను స్వీకరించే సమర్థుడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ప్రవర్తన, నడవడికల గురించి ఫిర్యాదులను అతను స్వీకరించవచ్చు. అదే విధంగా హైకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తన నడవడికల గురించి ఫిర్యాదులను ఆయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీకరించవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్​235 ప్రకారం జిల్లా కోర్టులు, ఇతర కోర్టులపై కోర్టు నియంత్రణ ఉంటుంది.

న్యాయవ్యవస్థలో అవినీతి..

పైన చెప్పిన విధంగా అవినీతి ఆరోపణల గురించి భారత న్యాయమూర్తికి అదేవిధంగా సంబంధించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తగిన చర్యల కోసం పంపించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టు, తదితర కోర్టుల న్యాయమూర్తులపై ఫిర్యాదులను రిజిస్ట్రార్​జనరల్​కి పంపించాల్సి ఉంటుంది.  రెండు సంవత్సరాల క్రితం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం ప్రభుత్వశాఖలో పేరుకుపోయిన అవినీతి గురించి ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థ కూడా అవినీతిలో కూరుకుపోయిందని పరిశీలనలు చేశారు. కోర్టు ప్రాంగణాల్లో పెరుగుతున్న అవినీతి వ్యవహారాలను ప్రస్తావించడంలో హైకోర్టు విఫలమైతే.. ఫలితాలు దారుణంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో అవినీతి ప్రభుత్వ శాఖలలోని అవినీతి కంటే ఘోరంగా ఉందని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థే ప్రజలకు చివరి మార్గం. అందుకని ఈ వ్యవస్థ అవినీతికి దూరంగా నిష్పక్షపాతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. 
న్యాయమూర్తులను ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉంటారు. అందుకని 24 గంటలూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు జిల్లాలకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలని ఏర్పాటు చేస్తున్నారు. ఖరీదైన బహుమతులని న్యాయవాదులు బహుకరిస్తున్నారు. న్యాయమూర్తులు రాజకీయ నాయకులు కాదు. వారికి ఈ ఫ్లెక్సీల స్వాగతాలు అవసరమా..? వీటిని చూసి ప్రజలు ఏమని అనుకుంటున్నారోనన్న విషయాన్ని న్యాయమూర్తులు పట్టించుకోవడం లేదు. ఫ్లెక్సీలతో గౌరవం పెరగదు. న్యాయమూర్తులకి ప్రచారం అవసరం లేదు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఓ అవినీతి న్యాయమూర్తి ఇంటి ముందు ఇచ్చట తీర్పులు అమ్మబడును అన్న పోస్టర్ని అతికించాడు. ఇప్పుడు ఆ సాహసం ఎవరైనా చేయగలరా..? ఏది ఏమైనా ప్రచార ఆర్భాటాల విషయంలో  ఖరీదైన బహుమతుల విషయంలో న్యాయమూర్తులు జాగ్రత్తలు తీసుకోవాలి.

జమాదార్​ సస్పెండ్

అలహాబాద్​ హైకోర్టులోని న్యాయమూర్తి అజిత్​సింగ్​ కోర్టులో పనిచేస్తున్న జమాదార్​ తన డ్రెస్స్​పైన నడుము దగ్గర పేటీఎం క్యూఆర్​ కోడ్​ స్టిక్కర్​పెట్టుకున్నాడు. దాని ద్వారా న్యాయవాదుల దగ్గర నుంచి టిప్స్​స్వీకరిస్తున్న సంఘటన అలహాబాద్​హైకోర్టు న్యాయమూర్తి అజిత్​సింగ్​దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ఓ ఉత్తరం ద్వారా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి రాజేశ్​బిందాల్​తీవ్రంగా తీసుకొని ఆ జమాదార్​ మీద చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్​ జనరల్ ని ఆదేశించారు. ఆ జమాదార్​ని ఆశీష్​గార్గ్, రిజిస్ట్రార్ జనరల్​ సస్పెండ్​ చేశారు. ‘తేదీ 29.11.2022న ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం న్యాయమూర్తి అజిత్​సింగ్​కోర్టుకి అటాచ్​చేసిన జమాదార్​రాజేంద్రకుమార్​, తన నడుముకు పేటీఎం క్యూఆర్​ కోడ్ ​కోర్టు పరిధిలో పెట్టుకున్నందున అతన్ని సస్పెండ్​చేస్తున్నాం. ఈ సస్పెన్షన్​ కాలంలో అతను నజారత్​ సెక్షన్​కి అటాచ్​చేస్తున్నాం. రిజిస్ట్రార్​ అనుమతి లేకుండా అతను హెడ్​క్వార్టర్​ వదిలి వెళ్లకూడదు. అతను ఏ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేయడం లేదన్న సర్టిఫికెట్​ దాఖలు చేసి జీవనాధార భృతిని అతను పొందవచ్చు’’​ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -డా.మంగారి రాజేందర్, జిల్లా ​జడ్జి (రిటైర్డ్)