సూరత్‌లోని లోక్‌సభ స్థానానికి ఒక్క ఓటు కూడా వేయకముందే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లక్షలాది మంది ఓటర్లు నిరాశకు గురై ఉంటారు. ఈవీఎం బటన్‌నొక్కి తాము ఈ దేశ ప్రజాస్వామ్యంలో పాల్గొన్నామన్న ఆనందం వాళ్లకి లేకుండా పోయి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎం బీప్ శబ్దాన్ని వినలేకపోయామని కొందరు, ఆ ఎన్నికల సందడిని చూడలేకపోయామని మరి కొందరు బాధపడి ఉంటారు.
ఓటువేసిన తరువాత సిరావేళ్లతో తమ ఛాయాచిత్రాలను సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్ చేయలేదని కూడా కొంతమంది చింతిస్తూ ఉండవచ్చు. సూరత్ ఎన్నికల్లో కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురైనాయి. మరికొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. (కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురికావడంలో ఎలాంటి ప్రలోభాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి ఉండక తప్పదు).
ప్రధానపార్టీ అయిన కాంగ్రెస్ ప్రైమరీ, స్టాండ్‌బై అభ్యర్థుల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురవగా మిగిలిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ప్రలోభాల గురించి విచారణ జరపాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈ ఎన్నిక కనీసం సరైన నామినేషన్ వేసిన అభ్యర్థికి ‘నోటా’కి మధ్య కూడా జరగలేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టు, ఎలక్షన్‌కమిషన్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సూరత్‌లో ఏం జరిగింది..
ఎలాంటి పోటీ లేకుండా అభ్యర్థులను ఎన్నుకోవడమనేది దేశంలోని స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలకు, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి ముప్పు అని అనుకోవచ్చు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఇది ప్రజాస్వామ్యం అన్న పదానికి విఘాతంగా పరిణమిస్తుంది. సూరత్‌లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఇంకా కొందరు స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రతిపాదించిన వారు నామినేషన్ పత్రాల మీద తమ సంతకాలని తిరస్కరించారు. అవి తమవి కాదని ఎలక్షన్అధికారి ముందు ప్రమాణ పత్రాలను దాఖలు చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరోకాదు ఆ అభ్యర్థి సొంత బావ, మేనల్లుడు, వ్యాపార భాగస్వామి. స్టాండ్‌బై అభ్యర్థి ప్రతిపాదకులు కూడా తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రిటర్నింగ్ అధికారికి తెలియజేశారు. ఈ మేరకు ప్రతిపాదకులు ప్రమాణపత్రాలను దాఖలు చేశారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను, అదేవిధంగా డమ్మీ అభ్యర్థి నామినేషన్ను ఎలక్షన్ అధికారి తిరస్కరించారు. మిగిలిన 8మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలని ఉపసంహరించుకున్నారు. ఇక మిగిలింది బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్. అతడిని విజేతగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎలాంటి జాప్యం లేకుండా ఈ నెల 22న ప్రకటించారు. అయితే, అభ్యర్థుల ఉపసంహరణకి, తిరస్కరణకి గల కారణాలు నమ్మదగినవిగా అనిపించడం లేదు.
ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం
ఎన్నికల్లో పోటీని తొలగించడానికి జరిగిన ప్రక్రియలు ఆందోళనను కలిగిస్తాయి. ఎందుకంటే అవి ప్రతిపక్షం, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ లేని రాజకీయాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ పోటీల తొలగింపు ప్రక్రియ మిగతా నియోజకవర్గాలకు వ్యాపిస్తే ప్రజస్వామ్యం మనుగడ సాగించదు. ఎన్నికల్లో పోటీని తొలగించడం అనేది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే. ఈ రోజు సూరత్ ప్రజలు తమ ఓటు హక్కుని కోల్పోయారు. రేపు దేశ ప్రజలు తమ ఓటు హక్కుని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఓటర్లు ఒత్తిడికి గురికాకుండా, ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం ఎన్నికల కమిషన్ బాధ్యత.
అనుమానాస్పద పరిస్థితుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోకుండా చూసుకోవడం కూడా ఎన్నికల కమిషన్ బాధ్యత. ఈ అసాధారణ, అనుమానాస్పద సంఘటనల మీద ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టలేదా? చండీగఢ్‌లో మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఈ మధ్య చర్యలు తీసుకొన్నది. ఎన్నికల విధ్వంసాన్ని రద్దు చేసింది. సూరత్ ఎన్నికల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆ విధంగా చర్యలు తీసుకొని ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తుందా వేచి చూడాలి.
కాంగ్రెస్ ముందున్న మార్గం హైకోర్టులో పిటిషన్
సూరత్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశాడు. ప్రతిపాదకులు అతని బంధువులు, బిజినెస్ పార్టనర్. అయితే, ఈ ప్రతిపాదకుల సంతకాలు నిజమైనవి కాదని బీజేపీ కార్యకర్త ఒకరు అతడి నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అభ్యర్థి నామినేషన్ పత్రాల మీద ప్రతిపాదకులు సంతకాలు చేయలేదని రిటర్నింగ్అధికారి ప్రతిపాదకుల నుంచి ప్రమాణ పత్రాలు స్వీకరించాడు. ఈ విషయం మీద అభ్యర్థి నుంచి ఒక రోజులో సమాధానాన్ని రిటర్నింగ్ అధికారి కోరాడు.
నిర్ణీత గడువులోగా ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి ముందు హాజరుకాలేదు. అందుకని అతని మూడుసెట్ల నామినేషన్ పత్రాలను ఆ అధికారి తిరస్కరించాడు. డమ్మీ అభ్యర్థి విషయంలో కూడా ఇదే జరిగింది. అతడి నామినేషన్ కూడా తిరస్కరణకి గురైంది. గతంలో కూడా ఏకగ్రీవ ఎన్నికలు దేశ స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రెండు దశాబ్దాల్లో జరిగినవి. ఈ క్రమంలో చివరిగా 2012లో జరిగింది. అయితే అప్పుడు ఇలాంటి ఆరోపణలు లేవు. ప్రతిపాదనలు వెనక్కి వెళ్లలేదు. ప్రతిపాదకులను ఒత్తిడికి గురిచేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని పరిశీలించిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది.
అనుమానాస్పద, అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్చర్య తీసుకుంటుందా అనేది సందేహమే. అందుకని రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 (బి) ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రశ్నించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక మార్గం గుజరాత్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం. ఈ విచారణను హైకోర్టు ఆరు నెలల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ, ఆ విధంగా పరిష్కరించిన సందర్భాలు లేనేలేవని చెప్పవచ్చు. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియ చాలాసార్లు అపహాస్యానికి గురవుతూనే ఉంది. ఇప్పడు జరిగింది పరాకాష్ట. న్యాయపరమైన పోటీల ద్వారా గెలిచినప్పుడే అది గెలుపు. నిర్ణయాలు ఎప్పుడూ నిజంవైపు ఉండాలి. ఆ విధంగా ఆలోచించే రిటర్నింగ్ అధికారులు ఎంతమందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
చట్టం ఏం చెబుతోంది?
ఈ పరిస్థితుల గురించి చట్టం ఏమి చెబుతుంది? ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 33 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే నిబంధనల గురించి తెలియ జేస్తోంది. 25 సంవత్సరాలు కానీ అంతకు మించి ఉన్న వ్యక్తి దేశంలో ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేయవచ్చు. అతని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వ్యక్తులు మాత్రం
ఆ ప్రాంతానికి చెందినవారై ఉండాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి నామినేషన్ ప్రతిపా దించడానికి ఒక వ్యక్తి మాత్రమే అవసరం. ఆ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి కానీ, ఏదైనా చిన్నపార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లయితే అతడి అభ్యర్థిత్వాన్ని 10మంది ప్రతిపాదిం చాల్సి ఉంటుంది.
వివిధ ప్రతిపాదకులతో నాలుగు సెట్ల నామినేషన్లను అభ్యర్థి దాఖలు చేసుకోవచ్చు. ఒక సెట్లో తప్పు ఉన్నా మిగతా సెట్ బాగుంటే అతడి అభ్యర్థిత్వం ఆమోదించ బడుతుంది. సెక్షన్ 36 ప్రకారం ఈ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఏ విధంగా తనిఖీ చేయాలో చెబుతున్నది. ప్రధానమైన సమస్య ఉంటే తప్ప అభ్యర్థి నామినేషన్ పత్రాలను తిరస్కరించ డానికి వీల్లేదు. అయితే నామినేషన్ పత్రాల మీద సంతకాలు నిజమైనవి కాదని వారు గుర్తించినప్పుడు నామినేషన్ను తిరస్కరించవచ్చు.
- డా. మంగారి రాజేందర్,
జిల్లా జడ్జి (రిటైర్డ్)