ఆదిలాబాద్, వెలుగు : బీఆర్ఎస్, బీజేపీలను ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. విదేశాల్లో ఉన్న 60 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉందని, దాన్ని బయటకు తీసుకొస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అంటూ ఎనిమిదేండ్ల కింద నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎంత తీసుకొచ్చారో చెప్పాలని నిలదీశారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి హామీని విస్మరించారన్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ‘జాగో తెలంగాణ’ పేరిట సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ అనుకూరి మురళి, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, పృథ్విరాజ్, స్కైబా, నైనాల గోవర్ధన్ లాంటి ప్రముఖులు హాజరవుతారని చెప్పారు.