కుల గణన చేయడం ఇష్టం లేకనే జాప్యం : ఈశ్వరయ్య

కుల గణన చేయడం ఇష్టం లేకనే జాప్యం : ఈశ్వరయ్య

ఖైరతాబాద్, వెలుగు: కులగణన చేయడానికి ఇష్టం లేకనే ఏదో కారణం చెప్పి పాలకులు తీవ్ర జాప్యం చేస్తున్నారని జాతీయ బీసీ  కమిషన్​మాజీ చైర్మన్, రిటైర్డ్​జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. జులూరి గౌరీశంకర్​ రచించిన' మా వాటా మాకే'  అనే పుస్తకాన్ని ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.​ కులగణన చేస్తే ఎవరి వాటా ఎంతో అన్న విషయం బయటకు వస్తుందనే ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తుందన్నారు.

ఆ తర్వాత రిటైర్డ్​ జస్టిస్​చంద్రకుమార్​మాట్లాడుతూ.. సరైన సమయంలో అవసరమైన పుస్తకాన్ని జులూరి రచించారన్నారు. కులగణన చేస్తే చీలి పోతారంటూ బీజేపీ అంటుందని, కుల వివక్ష అనేది మనుధర్మం, మనువాదుల వల్లనే వచ్చిందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ మాట్లాడుతూ.. కుల గణన కోసం ఆరు నెలలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని పేర్కొన్నారు.

బీసీల ఓట్లతో గద్దెనెక్కిన వారు 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. హైదరాబాద్ సిటీలో త్వరలో అఖిల పక్షంతో ఓ భారీ సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు,అధ్యక్షులను ఆహ్వానిస్తామన్నారు. మారుతీ సాగర్​అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఐఏఎస్​అధికారి చిరంజీవులు, ప్రొఫెసర్​లక్ష్మణ్​తదితరులు పాల్గొన్నారు.