- 28 మందికి లెటర్రాస్తే.. కేసీఆర్ ఒక్కరే స్పందించలే
- లెటర్లో ఆయన వాడిన భాష బాగాలేదు
- నేను ఎప్పుడూ రేవంత్‌ను కలవలేదు
- నాపై అబద్ధాలు ప్రచారం చేశారు
- విద్యుత్ కొనుగోళ్లపై నివేదిక పూర్తయిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ప్రకటించారు. కమిషన్‌ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కమిషన్ చైర్మన్ ను మార్చాలని మంగళవారం సుప్రీం బెంచ్ ఆదేశించింది. దీంతో జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు చెప్పారు.
ప్రజలకు అన్ని విషయాలూ తెలియాలన్న ఉద్దేశంతోనే విచారణ కమిషన్లు వేస్తారు. విచారణ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే మీడియాతో మాట్లాడాను. అంతేతప్ప మీడియాతో ఎక్కడా నా అభిప్రాయం చెప్పలేదు. కానీ కొందరు నాపై అబద్ధాలను ప్రచారం చేశారు” అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు.
విచారణ సమయంలో మీడియా సమావేశం పెట్టానని సుప్రీంకోర్టు విచారణలో ప్రస్తావనకు వచ్చిందని, కానీ తనను కోర్టు ఎక్కడా తప్పు పట్టలేదన్నారు. ‘‘విద్యుత్ ఒప్పందాలపై ఇప్పటికే విచారణ పూర్తి చేశాను. నివేదిక పూర్తయ్యింది. వాస్తవానికి శనివారం నివేదికను సబ్‌మిట్ చేయాలనుకున్నా. ఇంతలో పిటిషన్ విచారణకు రావడంతో సమర్పించలేదు. కమిషన్ గురించి పిటిషన్ వేస్తే తప్పేమీ లేదు” అని చెప్పారు.
కేసీఆర్ ఒక్కరే స్పందించలే..
పవర్ కమిషన్ విచారణలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని, కమిషన్ తరఫున 28 మందికి లెటర్లు రాశానని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. కేసీఆర్ తప్ప మిగతా వారందరూ తమ అభిప్రాయాలను చెప్పారన్నారు. ‘‘నేను వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ కమిషన్ లోనూ పని చేశా. అలాంటిది విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని కేసీఆర్ లెటర్ రాశారు. అందులోనూ సమాజం అంగీకరించని భాష వాడారు. ఎన్నో కమిషన్ ల చైర్మన్లు ప్రెస్ మీట్లు పెట్టినా రాని అభ్యంతరం నా పైనే ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. అందరి అభిప్రాయాలు తీసుకుని నివేదిక సిద్ధం చేశా. నేను ఇచ్చే రిపోర్ట్ నా వ్యక్తిగతం. దానిపై ఎవరికీ హక్కులేదు. కమిషన్ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అంగీకరించొచ్చు.
అంగీకరించకపోవచ్చు. ఆ రిపోర్ట్‌ను తప్పని ఎవరైనా సవాల్ చేయొచ్చు కూడా” అని స్పష్టం చేశారు. ‘‘నేను ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలువలేదు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు అంటున్నారు. ఎవరికి చెంపపెట్టో అందరికీ తెలుసు” అని జస్టిస్ నరసింహారెడ్డి తేల్చిచెప్పారు. కాగా, జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ నరసింహారెడ్డి సమర్పించిన రాజీనామా లేఖను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగానే బెంచ్ కు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అందజేశారు.