రిటైర్డ్ ఎంపీడీవో హత్య కేసులోమరో ముగ్గురు అరెస్ట్

రిటైర్డ్ ఎంపీడీవో హత్య కేసులోమరో ముగ్గురు అరెస్ట్
  • కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించిన పోలీసులు
  • గిరబోయిన అంజయ్య పోలీసు కస్టడీ మరో 2 రోజులు పొడిగింపు

బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్​ఎంపీడీవో రామకిష్టయ్య, సుభద్ర హత్య కేసుల్లో మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్​పంపినట్లు పోలీసులు తెలిపారు. పోచన్నపేటకు చెందిన రిటైర్డ్​ ఎంపీడీవో నల్ల రామకిష్టయ్యను జూన్​ 15న రాత్రి కిడ్నాప్ చేసి, హత్య చేసి శవాన్ని జనగామ సమీపంలోని చంపక్​హిల్స్​లోయల్లో పడేశారు. అలాగే మండలంలోని సదాశివపేటకు చెందిన సుభద్రను గతేడాది అక్టోబర్​లో హత్య చేశారు. 

వీరి హత్యతో సంబంధం ఉన్న జనగామ జడ్పీ వైస్​చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త గిరబోయిన అంజయ్యను, మరో ఇద్దరిని ఇదివరకే అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపించారు. తర్వాత అంజయ్యను రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పూర్తి సమాచారం సేకరించారు. అతడిచ్చిన సమాచారంతో గోపాల్​నగర్ కు చెందిన పస్తం జలంధర్, పస్తం పెద్ద ఉప్పలయ్య, పోచన్నపేటకు చెందిన గట్టు మల్లేశంను అరెస్ట్ చేసి కోర్డులో హాజరు పరిచారు. ఈ రెండు కేసులకు సంబంధించి మరో నలుగురిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అంజయ్య కస్టడీని మరో రెండు రోజులు పొడిగించినట్లు సమాచారం.