రిటైర్డ్​ ఎంపీడీవో మర్డర్​ కేసు ఎంక్వైరీ స్పీడప్​

  • పోలీసుల అదుపులో మిగతా ఇద్దరు నిందితులు?
  • కస్టడీకి పోలీసుల పిటిషన్​ 
  • విధుల్లో నిర్లక్ష్యం వహించిన బచ్చన్నపేట ఎస్సై సస్పెన్షన్​

జనగామ, వెలుగు : రిటైర్డ్​ ఎంపీడీవో  నల్లా రామకృష్ణయ్య  మర్డర్​ కేసు ఎంక్వైరీలో  పోలీసులు స్పీడ్​ పెంచారు.  హత్య వెలుగులోకి వచ్చిన రోజే ముగ్గురు నిందితులను అదుపులోకి  తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అరెస్ట్​ అయి రిమాండ్​లో ఉన్న నిందితుల కస్టడీ కోరుతూ రెండ్రోజుల కింద కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.  నేడో రేపో  కోర్టు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.  సదరు వ్యక్తుల్లోని గిరబోయిన అంజయ్యతో పాటు,  మిగిలిన ఇద్దరిని కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారం రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రామకృష్ణయ్యకు గతంలో ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి.?. వివాదాల క్రమంలో మరో 23 మంది వ్యక్తుల ప్రమేయంపై కూడా  పరిశీలిస్తున్నారు. మరో వైపు బచ్చన్నపేటలో గిరబోయిన అంజయ్య  భూ దందాలపై ఆరా తీస్తున్నారు. 

బచ్చన్నపేట ఎస్సై సస్పెన్షన్​.. 

బచ్చన్నపేట:  రిటైర్డ్​ ఎంపీడీవో  రామకిష్టయ్య  హత్య కేసులో గురువారం బచ్చన్నపేట ఎస్సై  నవీన్​కుమార్​పై  సస్పెన్షన్​ వేటు పడింది.  ఈ నెల 15న  రామకిష్టయ్య  కిడ్నాపైన గంటలోపే కుటుంబ సభ్యులు బచ్చన్నపేట పోలీస్​స్టేషన్​లో  కంప్లైంట్​ చేశారు.  దీన్ని పట్టించుకోని ఎస్సై ఎఫ్​ఐఆర్​ కూడా నమోదు చేయలేదు. కంప్లైంట్​ చేసిన అనుమానితుడి ఆచూకీ తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు.

 వెంటనే ఎస్సై స్పందించి ఉంటే రామకిష్టయ్య బతికేవాడని కుటుంబసభ్యులు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్తున్నాయి. ఈ మేరకు సీపీ ఏవీ రంగనాథ్​ దర్యాప్తులో ఇదే కాకుండా,  గతంలో నమోదైన కేసుల్లో సైతం ఎస్సై నవీన్​ కుమార్​ అలసత్వం వహించాడని తేలడంతో సస్పెండ్​చేశారు.