
జనగామ, వెలుగు : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హత్య కేసు నిందితులను రెండ్రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించడానికి వరంగల్ ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం పర్మిషన్ ఇచ్చింది. దీంతో ప్రధాన నిందితుడు జడ్పీ వైస్ చైర్ పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు బుధ, గురువారాలు తమ కస్టడీలో ఉంచుకుని ప్రత్యేక విచారణ చేపట్టనున్నారు.
ఇప్పటికే పలువురు అనుమానితులను విచారిస్తున్నారు. కాగా, అరెస్టైన రోజే సదరు నిందితులు రామకృష్ణయ్య హత్యతో పాటు నిరుడు చేసిన సుభద్ర హత్యను ఒప్పుకున్నారు. కాగా బచ్చన్నపేట మండలంలో గతంలో జరిగిన అనుమానాస్పద మృతి ఘటనలన్నింటిపై విచారణ జరపాలని రామకృష్ణయ్య కొడుకు అశోక్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల కస్టడీతో మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి.