జనగామ జిల్లాలో బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తుండగా కిడ్నాప్కి గురైన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆయన ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ కనిపించడం లేదంటూ 3 వారాల క్రితం ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు జూన్18న చంపక్ హిల్స్ శివారులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. అది రామకృష్ణదే అని నిర్ధారించుకున్నాక హత్య చేసి కుంటలో పడేసినట్లు పోలీసులు భావించారు.
భూవివాదంలో ఆయన్ని సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు చివరికి నిర్ధారించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇందులో అధికార పార్టీ నాయకుడితో పాటు మరో ముగ్గరిని విచారిస్తున్నారు. జడ్పీ వైస్ చైర్మన్ భర్తతో పాటు ఎమ్మెల్యే తమ అనుచరులతో హత్య చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీపీ రంగనాథ్ ఇవాళ మీడియాకు వివరించనున్నారు.
నిరసనలు..
రామకృష్ణను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. బచ్చన్నపేట చౌరస్తాలో కుటుంబ సభ్యులు నిరసనలు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.