పహల్గాం ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్: పాక్ రిటైర్డ్ మేజర్ ఆదిల్ రజా సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్: పాక్ రిటైర్డ్ మేజర్ ఆదిల్ రజా సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: ఉగ్రవాదులను పెంచి పోషించి భారత్‎లో దాడులు చేయించడం.. ఆ తర్వాత మాకేమి సంబంధం లేదనడం దాయాది దేశం పాకిస్థాన్‎కు వెన్నతో పెట్టిన విద్య. ప్రశాంతంగా ఉన్న భారత్‎లో దాడులు చేయించి.. చంపిన వారే సంతాపం తెలిపిన మాదిరిగా ఆ దాడులను ఖండించడంలో పాక్ దిట్ట. ఇటీవల జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి విషయంలోనూ పాక్ ఇదే పాత పాటను మళ్లీ రిపీట్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి వెనక పాక్ ప్రమేయం ఉందని భారత్ ఆరోపించగా.. ఛీ ఛీ అలాంటిదేమి లేదు.. అసలు మాకు ఏం తెలియదు.. సంబంధమే లేదు అని.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించింది పాక్.

ఈ క్రమంలో పాక్‎ను ఇరుకున పెట్టేలా ఆ దేశ ఆర్మీ రిటైర్డ్ మేజర్ ఆదిల్ రజా పహల్గాం ఉగ్రదాడి ఘటనపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. జనరల్ మునీర్ వ్యక్తిగత లాభం కోసమే ఈ దాడికి పాల్పడ్డాడని ఆదిల్ రజా షాకింగ్ కామెంట్స్ చేశారు. 

‘‘పహల్గామ్ ఉగ్రదాడి ఫాసిస్ట్ అసిమ్ మునీర్, సైన్యంలోని అతని సహచరులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి చేసిన వ్యక్తిగత చర్య. ఒక దుండగుడి వ్యక్తిగత లాభం కోసం చేసిన దానికి సైన్యం బాధ్యత వహించలేదు. బలూచిస్తాన్‌లో తిరుగుబాటుదారులకు భారత్ మద్దతు ఇస్తోందన్న ఆరోపణలకు ప్రతిస్పందనగా కూడా ఈ దాడి జరిగి ఉండవచ్చు. ఈ దాడి ద్వారా అసిమ్ మునీర్ తనను తాను బలమైన నాయకుడిగా చూపించుకోవాలనుకుంటున్నాడు’’  ఆదిల్ రజా కీలక వ్యాఖ్యలు చేశారు. 

పాక్ అక్రమిత కాశ్మీర్‎పై వారం రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘కశ్మీర్ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. అది మా జీవనాడి (జుగులార్ సిర). కశ్మీర్‎ను మేం ఎప్పటికీ మరచిపోము. మా కాశ్మీర్ సోదరుల వీరోచిత పోరాటాన్ని వదిలిపెట్టము. మీరు మీ పిల్లలకు ఖచ్చితంగా పాకిస్తాన్ కథ చెప్పాలి. మన పూర్వీకులు జీవితంలోని ప్రతి అంశంలోనూ మనం హిందువుల కంటే భిన్నంగా ఉన్నామని భావించారు. మన మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు భిన్నంగా ఉంటాయి.

అదే రెండు దేశాల విభజన సిద్ధాంతానికి పునాది వేసింది. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులు దేశ రాయబారులు. వారంతా ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారు. వాళ్లకు భారతీయులతో సంబంధం లేదు’’ అని అన్నారు. మునీర్ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారం రోజుల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రదాడి జరగడం, ఈ దాడి వెనక మునీర్ ప్రమేయం ఉందని ఏకంగా పాక్ ఆర్మీ మాజీ అధికారే ఆరోపణలు చేయడం సంచనలంగా మారింది. పహల్గాం టెర్రర్ ఎటాక్‎తో మాకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకున్న పాక్‎కు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.