యూనివర్సిటీల్లో రిటైర్డ్ ప్రొఫెసర్ల తిష్ట.. ఏటా రూ.3 కోట్ల వేతనం

కరీంనగర్, వెలుగు : తెలంగాణలోని యూనివర్సిటీల్లో రిటైర్డ్ ప్రొఫెసర్లు తిష్ట వేశారు. ఉద్యోగ విరమణ పొందినవాళ్లను అడ్జంక్ట్ (పార్ట్​టైం, కాంట్రాక్ట్​), గెస్ట్ ఫ్యాకల్టీ పేరిట ప్రస్తుత వైస్ చాన్స్ లర్లు తిరిగి నియమించుకున్నారు. ఇలా కాకతీయ, శాతవాహన, ఉస్మానియాతోపాటు ఇతర యూనివర్సిటీల్లో సుమారు 50 మందికిపైగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకతీయ యూనివర్సిటీలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా రిటైర్డ్ ప్రొఫెసర్​నే రిజిస్ట్రార్ గా నియమించారు.

ఇప్పటికే పీహెచ్ డీలు పూర్తయి, నెట్/ సెట్ అర్హత కలిగిన ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి చూస్తుంటే రిటైర్డ్ అయిన ఫ్యాకల్టీని మళ్లీ విధుల్లోకి తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇంకా కొనసాగుతున్న రిటైర్డ్ అయిన వ్యక్తుల వివరాలివ్వాలని తాజాగా సర్కార్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో యూనివర్సిటీల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 

అత్యధికంగా కాకతీయ యూనివర్సిటీలో.. 

కాకతీయ యూనివర్సిటీలో అత్యధికంగా 16 మంది రిటైర్డ్ ప్రొఫెసర్లు, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను అడ్జంక్ట్ ప్రొఫెసర్లుగా వీసీ టి.రమేశ్​ నియమించారు. వీరిలో డాక్టర్. వి.కృష్ణారెడ్డి, ప్రొఫెసర్ రామస్వామి(బాటనీ), ప్రొఫెసర్ సదానందం(బయో టెక్నాలజీ), ప్రొఫెసర్ ఎస్.రాంరెడ్డి (మైక్రోబయాలజీ), ప్రొఫెసర్ గంగాధర్ రెడ్డి(ఫిజిక్స్), ప్రొఫెసర్ అచ్చయ్య(ఫార్మసీ), ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు, ప్రొఫెసర్ రామయ్య(ఇంజినీరింగ్). ప్రొఫెసర్ రాంనాథ్ కిషన్(ఎడ్యుకేషన్), ప్రొఫెసర్ దామోదర్ రావు(ఇంగ్లీష్), ప్రొఫెసర్ అంజయ్య(లైబ్రరీ సైన్స్), ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు(కామర్స్) ఉన్నారు. వీరందరిని ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా నిరుడు జనవరి 30న నియమించారు.

వీళ్ల నియామకంపై వివాదం చెలరేగుతుండగానే ప్రొఫెసర్ రఘునాథరావు(ఫార్మసీ), డాక్టర్ క్రిస్టోఫర్(బాటనీ), ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్(ఎడ్యుకేషన్) ప్రొఫెసర్ కృష్ణమాచారి(కామర్స్​)లను మార్చిలో నియమించారు. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తోంది. అలాగే, శాతావాహన యూనివర్సిటీలో ఇన్ చార్జి వీసీ చిరంజీవులు హయాంలో యూజీసీ రూల్స్ కు అనుగుణంగా అడ్జంక్ట్ ప్రొఫెసర్ల నియామకం జరగగా, ప్రస్తుత వీసీ మల్లేశ్​హయాంలో మాత్రం నిబంధనలకు నీళ్లొదిలారనే ఆరోపణలున్నాయి. మల్లేశ్​ హయాంలో ప్రొఫెసర్ వన్నాల రమేశ్ (సోషియాలజీ), ప్రొఫెసర్ టి.భరత్(మేనేజ్​మెంట్), ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి, డాక్టర్ ఎం. ఉషారాణి(ఎకానమిక్స్), ప్రొఫెసర్ జె.ప్రభాకర్ రావు(ఫిజికల్ ఎడ్యుకేషన్), డాక్టర్ గండ్ర లక్ష్మణ్ రావు(తెలుగు), ప్రొఫెసర్ పురుషోత్తం(ఇంగ్లిష్), ప్రొఫెసర్ కె.సాయిలు(కామర్స్), ప్రొఫెసర్ పి.శ్రీనివాస్(కెమిస్ట్రీ)ను వీసీ నోటిఫికేషన్ లేకుండా  నేరుగా నియమించారనే ఆరోపణలున్నాయి. వీరిలో ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి, డాక్టర్ ఎం. ఉషారాణి రిజైన్ చేసి వెళ్లగా, మిగతావాళ్లు కొనసాగుతున్నారు.

ఇదే యూనివర్సిటీలో ట్రెజరీ విభాగం రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ కూడా మూడేండ్లుగా కొనసాగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ రవీందర్ యాదవ్ డిపార్ట్ మెంట్ (పొలిటికల్ సైన్స్)కు చెందిన ప్రొఫెసర్ జేఎల్ఎన్ రావు, ప్రొఫెసర్ చెన్నబసవమయ్యతోపాటు  మరొకరిని తీసుకున్నట్లు తెలిసింది. ఇతర యూనివర్సిటీల్లోనూ ఇదే పద్ధతిలో మరో 20 మంది వరకు పనిచేస్తున్నట్లు సమాచారం. 

కేయూ రిజిస్ట్రార్ పోస్టులో రిటైర్డ్ ప్రొఫెసర్.. 

యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా రిటైర్డ్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావును వైస్ చాన్స్ లర్ రమేష్ నియమించడంపై వివాదం నెలకొంది. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ యాక్ట్  సెక్షన్ 15.1 ప్రకారం పూర్తికాల జీతభత్యం తీసుకునే వారే రిజిస్ట్రార్​గా కొనసాగాల్సి ఉంటుంది. యూనివర్సిటీలో రెగ్యులర్లు ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ రిటైర్డ్ అయి పెన్షన్ తీసుకునే వ్యక్తిని రిజిస్ట్రార్​గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని అకుట్ (అసోసియేషన్​ ఆఫ్ ​కాకతీయ యూనివర్సిటీ టీచర్స్​) జనరల్ సెక్రటరీ డాక్టర్ మామిడాల ఇస్తారి వెల్లడించారు.

 అంతేగాక, అడ్జంక్ట్ ప్రొఫెసర్​గా తన నియమకానికి సంబంధించిన ఆర్డర్​ను రిజిస్ట్రార్ హోదాలో  శ్రీనివాసరావే తీసుకోవడం గమనార్హం. రిజిస్ట్రార్ పదవితో పాటు ఈయన ఏడాదిగా ఎస్ డీఎల్సీఈ డైరెక్టర్​గానూ కొనసాగుతున్నారు. సెల్ఫ్​ ఫైనాన్స్ కోర్సుల డైరెక్టర్ గానూ కొన్నాళ్లు పని చేశారు. అలాగే,  గతంలో కేయూ విమెన్స్​ ఇంజినీరింగ్ కాలేజీలో రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు హైదరాబాద్​లోని గురునానక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్​గా , హన్మకొండ కేయూలో అడ్జంక్ట్ ప్రొఫెసర్​గా ఐదు నెలలపాటు ఏకకాలంలో పని చేశారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఫార్మసీ ప్రొఫెసర్ రఘురామారావు సిద్ధిపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేస్తూనే.. కేయూలో అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా ఏకకాలంలో పని చేస్తున్నారు. 

రూల్స్​..గీల్స్​ జాన్తా నై...

అడ్జంక్ట్ ప్రొఫెసర్ల నియామకంలో రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలోనూ యూజీసీ నిబంధనలు పాటించలేదు. వీరిని డిపార్ట్​మెంటల్​ కమిటీలోని డిపార్ట్ మెంట్ హెడ్, బీవోఎస్ చైర్మన్, కన్వీనర్లుగా ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉండగా నేరుగా వైస్ చాన్స్ లర్లే సెలక్ట్ చేసుకోవడం గమనార్హం. అంతేగాక, యూనివర్సిటీ చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, అలాంటివేమీ లేకుండానే తమకు నచ్చినవాళ్లను, దగ్గరివాళ్లను అడ్జంక్ట్ ప్రొఫెసర్లుగా నియమించుకున్నారు. క్లాసులు తీసుకున్నా..తీసుకోకపోయినా నెలకు రూ.50 వేల చొప్పున జీతాలిస్తున్నారు. ఇలా ఏటా సుమారు రూ.3 కోట్లను చెల్లిస్తున్నారు.