- కాళేశ్వరం కమిషన్‌కు చెప్పిన రిటైర్డ్ ఎస్ఈ మురళీ కృష్ణ
- 2019లో వరదలొచ్చినయ్
- సుందిళ్ల, అన్నారంలో బుంగలుపడ్డయ్
- 15 మీటర్ల ఎత్తు దాటితే డ్యామ్లుగానే పరిగణించాలి
- వర్చువల్‌గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన చైర్మన్ పినాకి చంద్రఘోష్
- జనవరిలో కేసీఆర్, హరీశ్‌రావును విచారించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: బ్యారేజీలైనా.. 15 మీటర్ల ఎత్తు ఉండి నీటిని స్టోర్ చేస్తే వాటిని కూడా డ్యామ్‌లుగా పరిగణించాలని డ్యామ్ సేఫ్టీ చట్టంలో ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్‌వో) రిటైర్డ్ ఎస్ఈ మురళీ కృష్ణ చెప్పారు. చెక్ డ్యాములు కూడా 10 మీటర్ల ఎత్తు దాటితే డ్యాములుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. అమెరికాలో ఉన్న ఆయన్ను.. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ సోమవారం వర్చువల్‌గా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ‘‘మేడిగడ్డ ఎప్పుడు దెబ్బతిన్నది? బ్యారేజీకి ఫస్ట్ టైమ్ వరదలు ఎప్పుడు వచ్చాయి?’’అని కమిషన్ ప్రశ్నించగా.. 2019 వరదలు వచ్చాయని, తొలుత సుందిళ్ల, అన్నారంలో బుంగలు (సీపేజీలు) ఏర్పడ్డాయని బదులిచ్చారు.
ఆ తర్వాత మేడిగడ్డ దెబ్బతిన్నదని చెప్పారు. అయితే, బ్యారేజీల అథారిటీ మాత్రం దాని గురించి రిపోర్టు చేయలేదన్నారు. బ్యారేజీలను డ్యాములుగా ఎలా గుర్తించారని మురళీ కృష్ణను కమిషన్ ప్రశ్నించింది. 2019లో బ్యారేజీలు పూర్తయితే.. 2021లో డ్యామ్ సేఫ్టీ చట్టం వచ్చిందని, 2023 జులైలో కాళేశ్వరం బ్యారేజీలను స్పెసిఫైడ్ డ్యాములుగా గుర్తించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం.. 2021, డిసెంబర్ 30న ఎస్‌డీఎస్‌వోను నోటిఫై చేశామని మురళీకృష్ణ చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను 2023లో స్పెసిఫైడ్ డ్యాములుగా నోటిఫై చేశామన్నారు. పదే పదే విజ్ఞప్తుల అనంతరం స్పెసిఫైడ్ డ్యాముల లిస్టులో బ్యారేజీలను చేర్చారని బదులిచ్చారు. అమెరికాలో ఎక్కడున్నారని కమిషన్ ప్రశ్నించగా.. సియాటిల్‌లో ఉంటున్నట్లు మురళీ కృష్ణ బదులిచ్చారు.
రెండో వారంలో మళ్లీ విచారణ
మరో దఫా క్రాస్ ఎగ్జామినేషన్‌ను రెండో వారంలో కమిషన్ నిర్వహించనున్నది. వాస్తవానికి సోమవారం ముగ్గురు అధికారులు విచారణకు రావాల్సి ఉన్నా.. ఒక్కరే హాజరయ్యారు. మంగళవారం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కోల్‌కతాకు వెళ్లిపోనున్నారు. రెండో వారంలో ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలను విచారించనున్నారు. ఇప్పటికే కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్లను పలువురు అధికారులు ప్రస్తావిం చారు. వారు చెబితేనే ముందు కువెళ్లా మన్నారు. ఈ నేపథ్యంలోనే వారిని వచ్చే ఏడాది జనవరిలో విచారిస్తారని చెప్తున్నారు.