![వృద్ధుల జనాభా పెరగడంతో రిటైర్మెంట్ వయసు పెంపు!](https://static.v6velugu.com/uploads/2023/03/china-Retirement_L1tFJn5ITN.jpg)
- 2035 నాటికి వృద్ధుల జనాభా 40 కోట్లకు చేరొచ్చని అంచనా
హాంకాంగ్: చైనాలో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. దీంతో విడతల వారీగా రిటైర్మెంట్ ఏజ్‌ను పెంచాలని చైనా సర్కారు ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చైనా మానవ వనరుల శాఖ పరిశీలనలో ఉన్నాయంటూ ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ కథనాన్ని ప్రచురించింది. రిటైర్మెంట్ సంస్కరణల్లో భాగంగా తొలి విడతగా పదవీ విరమణ (రిటైర్మెంట్) వయసును కొన్ని నెలల పాటు పెంచుతారని తెలుస్తోంది. ఉద్యోగులు లేదా కార్మికుల ఆరోగ్య స్థితిగతులు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రిటైర్మెంట్ తేదీని ముందుకు, వెనక్కు మార్చుకునే వెసులుబాటును కూడా కల్పించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో పురుషుల రిటైర్మెంట్ ఏజ్60 ఏళ్లు. వైట్ కాలర్ జాబ్స్ చేసే మహిళల రిటైర్మెంట్ ఏజ్ 55 ఏళ్లు, ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళల రిటైర్మెంట్ ఏజ్ 50 ఏళ్లు. పదవీ విరమణ వయసుకు సంబంధించిన సంస్కరణలపై తమ ప్రభుత్వం లోతైన అధ్యయనం చేశాక ఒక పాలసీని ప్రకటిస్తుందని చైనా కొత్త ప్రధాని లీ క్వియాంగ్ వెల్లడించారు.
పెన్షన్ బడ్జెట్లో తీవ్ర లోటుతో సతమతం
చైనాలో 60 ఏళ్లు పైబడిన వారు దాదాపు 28 కోట్ల మంది ఉన్నారు. ఈ సంఖ్య 2035కల్లా 40 కోట్లకు పెరగొచ్చని చైనా సర్కారు అంచనావేస్తోంది. అంటే ఏటా రిటైర్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. దీనివల్ల వారికి చేయాల్సిన పెన్షన్ పేమెంట్స్‌కు పెద్ద మొత్తంలో బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించాల్సి వస్తుంది. రిటైర్మెంట్ ఏజ్‌ను క్రమంగా పెంచడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఈ ఒత్తిడి కొంతమేర తగ్గించుకోవచ్చని చైనా సర్కారు భావిస్తోంది. ‘యాక్టివ్వర్కర్స్, ఎంప్లాయీస్ సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రిటైర్ అయ్యేవాళ్ల సంఖ్య మాత్రం పెరుగుతోంది. దీనివల్ల ఇప్పటికే చైనాలోని 31 ప్రావిన్స్‌లు పెన్షన్ బడ్జెట్ కు సంబంధించిన తీవ్ర లోటును ఎదుర్కొంటున్నాయి. 2035 నాటికి పెన్షన్ విభాగాల గల్లా పెట్టెలన్నీ ఖాళీ అయ్యే చాన్స్ ఉంది’ అని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.