ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ ఏజ్​ 65 ఏండ్లు

ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ ఏజ్​ 65 ఏండ్లు
  • 5 ఏండ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్,వెలుగు:  రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల  పదవీ విరమణ వయస్సును 60  ఏండ్ల నుంచి 65కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా గురువారం జీవో నెంబర్ 3 రిలీజ్ చేశారు.  ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా  ప్రొఫెసర్ల రిటైర్​మెంట్​ ఏజ్​ను పెంచుతామని ప్రకటించగా, దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, సర్కారు తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం రిటైర్​ కావాల్సిన ఐదుగురు ప్రొఫెసర్ల  పదవీ విరమణ సభలు వాయిదా పడ్డాయి. అనుభవం ఉన్న సీనియ ర్ ఫ్యాకల్టీ సేవలను ఉపయోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్కారు ప్రకటించింది. 

రిక్రూట్​మెంట్​పైనా కసరత్తు..

కొన్నేండ్లుగా వర్సిటీల్లో రిక్రూట్​మెంట్​ఆగిపోయింది. ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖ పరిధిలోని 11 వర్సిటీల్లో 2,817 సాంక్షన్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా, వాటిలో కేవలం 757 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 2,060 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల్లో కాంట్రాక్టు, పార్ట్ టైమ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో 7 వర్సిటీల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు. ప్రొఫెసర్ల సంఖ్య తగ్గుతుండడంతో వర్సిటీల ర్యాంకులు పడిపోతున్నాయి.  రిక్రూట్​మెంట్​ ప్ర క్రియపైనా సర్కారు కసరత్తు చేస్తున్నది.  ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా కేవలం తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే ప్రొఫెసర్ల రిటైర్​మెంట్​ ఏజ్ 60 ఏండ్లుగా ఉన్నది.  ఇప్పటికే 10  రాష్ట్రాల్లో పదవీ విరమణ వయస్సు 65 ఉండగా, ఆ జాబితాలో ఇప్పుడు తెలంగాణ కూడా చేరింది. మరో 9 రాష్ట్రాల్లో 62 ఏండ్లుగా ఉంది. సెంట్రల్ వర్సిటీల్లో పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లు. ఈ క్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర సర్కారు ఆమోదించింది.