సునీతా విలియమ్స్​ రాక వాయిదా

సునీతా విలియమ్స్​ రాక వాయిదా



    స్పేస్​క్రాఫ్ట్​లో సాంకేతిక లోపమే కారణం
    ఐఎస్ఎస్​లోనే భారత సంతతి ఆస్ట్రోనాట్

న్యూయార్క్:స్పేస్​క్రాఫ్ట్​లో సాంకేతిక లోపంతో భారత సంతతి ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్ ​తిరుగుప్రయాణం వాయిదాపడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​) నుంచి తిరిగి వచ్చే తేదీని ఇంకా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రకటించలేదు. దీంతో ఆమె మరికొద్దిరోజులు ఐఎస్ఎస్​లోనే ఉండనున్నారు.

వ్యోమగామి బుచ్​విల్​మోర్​తో కలిసి బోయింగ్​ స్టార్​లైనర్​ స్పేస్​క్రాఫ్ట్​లో ఆమె ఈ నెల 5న ఐఎస్ఎస్​కు చేరుకున్నారు. అప్పుడు కూడా సాంకేతిక సమస్యల కారణంగా ఈ పర్యటన పలుమార్లు వాయిదాపడిన తర్వాత విలియమ్స్​ ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. 10 రోజుల మిషన్​లో భాగంగా వీరు ఈ యాత్ర చేపట్టారు. ఈ నెల 14న వీరిద్దరూ భూమిపైకి రావాల్సి ఉండగా, స్పేస్​క్రాఫ్ట్​లో హీలియం లీకేజీ కారణంగా ప్రయాణం​ఈ నెల 26కు ఇది వాయిదా పడింది.

తాజాగా వ్యోమనౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో మరోసారి పోస్ట్​పోన్​ అయింది. నాసా కొత్త తేదీలు ప్రకటించేవరకూ సునీతా విలియమ్స్​తోపాటు బుచ్​విల్​ మోర్ ఐఎస్ఎస్​లోనే ఉండనున్నారు. మిషన్​ను పరిశీలిస్తున్నామని, అన్నీ అనుకూలిస్తే వచ్చే నెల 2న భూమిపై వారు ల్యాండ్​ అవ్వొచ్చని నాసా అంచనా వేసింది. ఐఎస్ఎస్​లో ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములతోపాటు విలియమ్స్, బుచ్​విల్​ సురక్షితంగానే ఉన్నట్టు నాసా వెల్లడించింది.