ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 10లోపు పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. మంగళవారం న్యూ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా పోలింగ్ పార్టీలు పోలింగ్ కేంద్రాలకు ఒక రోజు ముందుగానే చేరుకుంటాయన్నారు. అందుకు వీలుగా 10లోపు పనులన్నీ పూర్తి స్థాయిలో చేయాలని సూచించారు.
జిల్లాలోని 438 పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు రూ. 13.50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ. 25 నుంచి 50 వేలు అడ్వాన్స్ గా ఇచ్చామన్నారు. ఎంపీడీవోలకు రూ. లక్ష చొప్పున నిధులు విడుదల చేశామని చెప్పారు. అనంతరం పోలింగ్ రవాణా ఆటో స్టిక్కర్ ను రిలీజ్ చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ బి. సత్యప్రసాద్, డీఈవో సోమశేఖరశర్మ, జడ్పీ సీఈవో వినోద్, డీపీవో హరికిషన్, మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివ కుమార్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, విద్యాశాఖ ఈఈ నాగశేషు, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, అధికారులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి
జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు. మంగళవారం న్యూ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో తాగునీటి సరఫరాపై ఆయన సమీక్షించారు. బుధవారం సాయంత్రంలోపు ఖమ్మం నగరపాలక సంస్థ కు నీటి విడుదలపై చర్యలు తీసుకోవాలన్నారు. లీకేజీలను వెంటనే నియంత్రించాలని సూచించారు.