పాలమూరు జిల్లాలో పూర్తయిన నామినేషన్ల స్క్రూటినీ

పాలమూరు జిల్లాలో పూర్తయిన నామినేషన్ల స్క్రూటినీ

వెలుగు, నెట్​వర్క్:  ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రిటర్నింగ్​ ఆఫీసర్లు సోమవారం నామినేషన్లను పరిశీలించి, అసంపూర్తిగా ఉన్న వాటిని తిరస్కరించారు. మబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసుల్లో ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్ మిశ్రా, ఇళక్కియా కరునాగరన్ తో కలిసి పరిశీలించారు. మహబూబ్ నగర్ లో 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వాటిలో అంతటి హరి ప్రసాద్ గౌడ్(ఇండిపెండెంట్). వీరబ్రహ్మచారి(బీజేపీ), ఉదయ్ తేజ్ నాయక్ (డెమోక్రటిక్  అలయన్స్)ల నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్  ఆఫీసర్​ అనిల్ కుమార్ తెలిపారు.

జడ్చర్లలో 20 నామినేషన్లు దాఖలు కాగా, శశికళ రెడ్డి(కాంగ్రెస్) నామినేషన్​ను తిరస్కరించినట్లు రిటర్నింగ్  ఆఫీసర్​ ఎస్. మోహన్ రావు తెలిపారు. దేవరకద్రలో 30 నామినేషన్లు దాఖలు కాగా, శివ మల్లేశ్, మహేందర్​(ఆర్ యూపీపీ), బాలకృష్ణ(బీజేపీ)ల నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్  అధికారి ఎన్.నటరాజ్  తెలిపారు. నారాయణపేట నియోజకవర్గంలో 3 నామినేషన్లు, మక్తల్ లో 3 నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్  ఆఫీసర్లు తెలిపారు. 

నాగర్​కర్నూల్​లో.. 

నాగర్​కర్నూల్  జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 13 నామినేషన్లను రిటర్నింగ్​ అధికారులు రిజెక్ట్​ చేశారు. ఎన్నికల పరిశీలకులు మిథిలేశ్​మిశ్రా, సతీశ్​కుమార్, కలెక్టర్​ ఉదయ్​కుమార్, రిటర్నింగ్​ ఆఫీసర్లు కుమార్​ దీపక్​, వెంకట్​రెడ్డి, గోపిరాం సమక్షంలో నామినేషన్ల స్క్రూటిని చేపట్టారు. నాగర్ కర్నూల్​ నియోజకవర్గంలో 6 నామినేషన్లను తిరస్కరించినట్లు ఆర్వో మర్రి జమునారాణి తెలిపారు. అచ్చంపేటలో 2, కొల్లాపూర్​లో 3, కల్వకుర్తిలో ఒక నామినేషన్ ను రిజెక్ట్​ చేసినట్లు రిటర్నింగ్​ ఆఫీసర్లు వెల్లడించారు. 

 వనపర్తిలో..

వనపర్తి నియోజకవర్గంలో 19 నామినేషన్లలో 14 నామినేషన్లను ఆమోదించినట్లు రిటర్నింగ్  ఆఫీసర్​ ఎస్.తిరుపతిరావు తెలిపారు. పరిశీలన అనంతరం 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎలక్షన్​ అబ్జర్వర్ సోమేశ్ మిశ్రా, పోలీస్  అబ్జర్వర్  రాజీవ్ మల్హోత్రా, కలెక్టర్​ తేజస్ నందలాల్  పవార్  సమక్షంలో 19 మంది అభ్యర్థులకు సంబంధించిన 39  నామినేషన్లను పరిశీలించారు.
 

ALSO READ : కాంగ్రెస్​ వస్తే ధరణి ఉండదు.. కరెంట్​ రాదు : సీఎం కేసీఆర్

గద్వాలలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో 38 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు ఓకే చేశారు. గద్వాలలో 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, ఐదుగురి నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్  అపూర్వ్  చౌహాన్  తెలిపారు. అలంపూర్ లో 25 మంది నామినేషన్లు వేయగా, 7 రిజెక్ట్  చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రకళ చెప్పారు. అలంపూర్​ బీఆర్ఎస్  అభ్యర్థి విజయుడు ఫీల్డ్  అసిస్టెంట్  పోస్టుకు రిజైన్  చేయలేదని అభ్యంతరం చెప్పారని, అయితే రిజైన్  చేసినట్లు ఆధారాలు చూపించడంతో నామినేషన్  ఓకే చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు.