వరంగల్, వెలుగు: ఆర్టీసీ బస్సులను మహిళలే నిర్వహించేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి సీతక్క చెప్పారు. ఈ నెల 19న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించే విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, మేయర్ సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఆదివారం పరిశీలించారు.
అనంతరం సీతక్క మాట్లాడుతూ కొందరు వ్యక్తులు యూట్యూబ్ చానల్స్ పెట్టి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలో మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదికను వివరిస్తామని ప్రకటించారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపును అమలు చేస్తామన్నారు.
పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసినా బీఆర్‍ఎస్, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసం అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ లీడర్లకు సొంత ప్రయోజనాలు తప్పితే, ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదని విమర్శించారు. ‘హైడ్రా తీసుకొస్తే అడ్డుకున్నరు.. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నరు.. కుటుంబ సర్వేను అడ్డుకుంటున్నరు.. లిమ్కా బుక్ రికార్డ్ కోసం బీఆర్‌ఎస్ మాదిరిగా సకల జనుల సర్వే చేపట్టలేదని.. పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికే కులగణన చేస్తున్నాం’ అని చెప్పారు. దేశంలో అత్యధిక దోచుకున్న పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీఆర్‍ఎస్ మాత్రమే అన్నారు.
మూసీ ప్రక్షాళన విషయంలో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నరు : మంత్రి కొండా సురేఖ
‘మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజలను రెచ్చగొట్టేలా కేటీఆర్ మాట్లాడుతున్నారు.. మూసీ పనులను ఎవరైనా అడ్డుకుంటే పురుగుల పడి చస్తారు’ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ మానసిక పరిస్థితి సరిగా లేదని.. డాక్టర్‌కు చూపించుకోవాలని సలహా ఇచ్చారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‍రెడ్డి ఫోన్ నుంచి ఓ బీఆర్‌ఎస్ నేతకు 48 సార్లు కాల్స్ వెళ్లాయన్నారు. దాడికి కారణమైన సురేశ్ ఇంకా పరారీలో ఉన్నాడన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులోఉన్న ఆఫీసర్లు బీఆర్‍ఎస్ లీడర్ల సహకారంతో ఇతర దేశాలకు పారిపోయారన్నారు. కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టే జైలుకు పోతా అంటున్నాడన్నారు. కేటీఆర్ విషయంలో నిజాలు తేల్చిన తర్వాతే చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధే లక్ష్యంగా తమ ఏడాది పాలన సాగిందన్నారు. హైదరాబాద్‍కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేసే ఆలోచనతో ఎయిర్‌పోర్ట్ వంటి ఎన్నో ప్రాజెక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు.