పేపర్ లీక్ వెనుక కేటీఆర్ పీఏ.. రేవంత్ సంచలన ఆరోపణలు

పేపర్ లీక్ వెనుక కేటీఆర్ పీఏ.. రేవంత్ సంచలన ఆరోపణలు

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ ఘటనలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ హస్తం ఉందని ఆరోపించారు.  కేటీఆర్ పీఏ సొంత  మండలం  కరీంనగర్ జిల్లా మాల్యాల మండలంలో 100  మందికి  గ్రూప్ 1 లో 100 కు పైగా మార్కులు వచ్చాయని.. దీనిపై పూర్తి విచారణ చేయాలన్నారు.  155 నోటిఫికేషన్లు ఇచ్చి 37 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన కేటీఆర్ ...లక్షల ఉద్యోగాలిచ్చామని గతంలో చెప్పింది అబద్ధమని  ఒప్పుకున్నారన్నారు.

 తెలంగాణ ఏర్పాడ్డక వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలన్నింటిపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.  పేపర్ లీకేజీతో  తనకు సంబంధం లేదని చెబుతున్న  కేటీఆర్..  సీఎం రివ్యూలో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు.కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  సీబీఐపై నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జితో పేపర్ లీక్ కేసును విచారణ చేయించాలని డిమాండ్ చేశారు రేవంత్. 

మార్చి 19న  ఎల్లారెడ్డిలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ దీక్ష చేస్తామని రేవంత్ అన్నారు.  ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష ఉంటుదన్నారు. 21న గవర్నర్ ను కలిసి పరిణామాలను వివరిస్తామన్నారు.