- భూములు కోల్పోయిన వాళ్లకు అందులో భాగస్వామ్యం కల్పించాలి : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలన్నారు. యాంటీ బయాటిక్స్, ఫెర్మంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్
న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మోటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. వీటితోపాటు పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని.. పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉంటుందని వెల్లడించారు. హెల్త్ కేర్
ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. గ్రీన్ ఫార్మా సిటీ ప్రణాళికలపై సోమవారం సెక్రటేరియెట్‌లో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా రివ్యూ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రీన్ ఫార్మా సిటీ పర్యావరణ హితంగా, పూర్తి కాలుష్య రహితంగా ఉండేలా చర్యలు
తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, కరెంట్, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాలను తొందరగా చేపట్టాలన్నారు. గ్రీన్ ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన వారికి ఫార్మాసిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. అందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
పెట్టుబడులకు ఫార్మా కంపెనీలు
గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు పాల్గొన్నారు.