హామీల అమలులో రేవంత్​ డకౌట్

హామీల అమలులో రేవంత్​ డకౌట్
  • ఎమ్మెల్యే హరీశ్ రావు 

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: గత పదేండ్లలో తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ గా చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్​రావు అన్నారు. తెలంగాణ అమరవీరుల గురించి ఆలోచించేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, ఆర్థిక సహాయం అందించిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన అన్నారు. 

బీఆర్ఎస్ నేత మాధవరం నర్సింగ్ రావు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో అమరవీరుల స్మారకార్థం నిర్వహించిన తెలంగాణ క్రికెట్ చాంపియన్ ట్రోపీ ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్ రావు హాజరై విజేతలకు కప్పు ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయానికి క్రికెట్ కు దగ్గరి సంబంధం ఉంటుందని.. ఆరు గ్యారంటీల హామీల అమలులో  రేవంత్ రెడ్డి డక్ అవుట్ అయ్యారని, మూసీలో పేదల ఇండ్ల జోలికి వచ్చి హిట్ వికెట్ అయ్యారన్నారు. మూసీని రూ.3,800 కోట్లతో బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి చేసిందని.. రేవంత్ రెడ్డి ఇప్పుడు గోదావరి నీళ్లు తేవడం, ఎస్టీపీలను మరిచి మూసీ పక్కన ఉన్న పేదల ఇండ్లు కూలుస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ చక్కటి ఫీల్డింగ్ చేస్తుందని.. త్వరలో  బీఆర్ఎస్ కు కప్పు ఖాయం అని అన్నారు. మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇండ్లు కూల్చితే సహించేదిలేదని హరీశ్​అన్నారు.