తెలంగాణలో మరో పదేళ్లు రేవంత్ ప్రభుత్వమే ఉంటుంది: మంత్రి వెంకట్ రెడ్డి

 తెలంగాణలో మరో పదేళ్లు రేవంత్ ప్రభుత్వమే ఉంటుంది: మంత్రి వెంకట్ రెడ్డి

నిజామాబాద్:  ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ కు తావు లేదన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. రాష్ట్ర గీతంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జూన్ 1వ తేదీ శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాదనుకున్న తెలంగాణ వచ్చిందన్నారు.  సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. వచ్చిన తెలంగాణలో పదేళ్ల పాటు కేసీఆర్ అనేక మోసాలు చేశారని దుయ్యబట్టారు. చావు నోట్లో ఎవరు తలకాయ పెట్టలేదన్నారు.

కేసీఆర్ తీసుకొచ్చిన అన్ని పథకాల్లో గోల్ మాల్ జరిగిందన్నారు మంత్రి. గొర్రెల స్కామ్ రూ.7 వందల కోట్లు కాదని..  రూ. 4 వేల 5 వందల కోట్లు అని చెప్పారు. లిక్కర్ స్కామ్ తో కవిత తెలంగాణ పరువు తీశారని విమర్శించారు. బతుకమ్మల చాటున లిక్కర్ వ్యాపారం చేశారని ఫైరయ్యారు.  లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్నారు.  మరో పదేళ్లు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వమే ఉంటుందని మంత్రి చెప్పారు.