- ప్రస్తుతం అసెంబ్లీలో ఆయనలాంటి నేత లేని లోటు కనిపిస్తున్నది: సీఎం రేవంత్
- ప్రతిపక్షంలో ప్రశ్నించాలని.. పాలకపక్షంలో పరిష్కరించాలని రోశయ్య చెప్పేవారు
- సీఎంగా ఎవరున్నా నంబర్ 2 పొజిషన్ మాత్రం ఆయనకే సొంతం
- హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మాజీ సీఎం రోశయ్య మూడో వర్ధంతి సభ
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్యలా వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే నేత అసెంబ్లీలో లేకపోవడం లోటుగా కనిపిస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అప్పట్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా.. నంబర్ 2లో రోశయ్యే ఉండాలని కోరుకునేవారని ఆయన గుర్తుచేశారు. ‘‘రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిష్కృతమైంది. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పాటైంది” అని తెలిపారు. డాక్టర్ కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో బుధవారం నిర్వహించిన రోశయ్య మూడో వర్ధంతి సభకు సీఎం రేవంత్ హాజరై మాట్లాడారు.
2007లో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీ గా మాట్లాడేందుకు నేను భయపడ్డాను. నీటి పారుదల శాఖపై మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను రోశయ్య తన చాంబర్ కు పిలిపించుకొని ప్రోత్సహించారు. బాగా మాట్లాడుతున్నావు.. మరింత అధ్యయనం చేసి సభకు రావాలని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు”అని గుర్తు చేసుకున్నారు. ‘‘ఆయన పట్టుదల, మాటల్లో చతురత ఎంతో ముఖ్యమైనవి.
పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను.. ప్రతిపక్షంలో ఉంటే సీఎంగా ఉన్న వ్యక్తిని ఇరుకున పెట్టే విధానాన్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరముంది” అని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీఎంలుగా పనిచేశారని.. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, భవనం వెంకట్రామ్, అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి వారంతా ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపించేందుకు కారణం రోశయ్యనేనని కొనియాడారు.
సమస్యలను పరిష్కరించేందుకు వారికి కుడి భుజంలా రోశయ్య వ్యవహరించేవారని.. అందుకే అప్పట్లో ఎవరు సీఎంలుగా ఉన్నా నంబర్ 2 పొజిషన్ పర్మినెంట్ అని.. నంబర్ 1 పొజిషన్ మాత్రమే మారుతుండేదని పేర్కొన్నారు. ఎవరు సీఎం అయినా నంబర్ 2లో రోశయ్యే ఉండాలని కోరుకునేవారని.. ప్రస్తుతం ఆయనలా వ్యూహాత్మకంగా వ్యవహరించే నేత అసెంబ్లీలో లేకపోవడం లోటుగా కనిపిస్తున్నదని సీఎం అన్నారు.
క్రమశిక్షణే సీఎం స్థాయికి తీసుకెళ్లింది: భట్టి
రోశయ్య జీవితం అందరూ అనుకున్నట్టు సజా వుగా సాగలేదని, ఆయన అనేక ఒడిదుడుకులు, రాజకీయ ఉద్యమాలను తట్టుకొని ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థి నేత నుంచి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా, తమిళనాడు గవర్నర్ గా రోశయ్య ఎదిగేందుకు క్రమశిక్షణ, నిజాయితీ దోహదపడిందని తెలిపారు. రోశయ్య ఆర్థిక మంత్రిగా, సీఎంగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, చీఫ్ విప్‌గా పని చేసే అదృష్టం కలిగిందని భట్టి గుర్తుచేసుకున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు వ్యక్తిగత దూషణలు లేకుండా సహేతుక సమాధానాలు చెప్పే విధానం రోశయ్యదని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం
ఏనాడూ సీఎం కావాలని రోశయ్య తాపత్రయ పడలేదని.. సందర్భం వచ్చినప్పుడు ఆయన్ను సోనియాగాంధీ ముఖ్యమంత్రిని చేశారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘క్లిష్ట పరిస్థితుల్లో ఎంపిక చేశారంటే పార్టీకి రోశయ్య పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం ఎలాంటిదో చెప్పొచ్చు. ఏనాడూ పదవులు కావాలని అధిష్ఠానాన్ని ఆయన కోరలేదు. హోదాలన్నీ వాటంతట అవే వచ్చాయి. రోశయ్యను అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా రాణించాలంటే ఆర్యవైశ్యుల సహకారం అవసరం ఉంది.
వారి వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇచ్చే బాధ్యత తీసుకుంట. పార్టీలోనూ సముచిత ప్రాధాన్యం కల్పిస్త” అని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు తనకు సమానమేనని రోశయ్య చెప్పేవారని అన్నారు. 50 ఏండ్ల కిందట్నే హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఇల్లు కట్టుకున్నారని, నిఖార్సయిన హైదరాబాదీ రోశయ్య అని సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రోశయ్యకు హైదరాబాద్‌లో విగ్రహం లేకపోవడం లోటు అని, ఆర్యవైశ్య నేతలు మంచి ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి సూచన చేస్తే.. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణం చేపడతామని, నాలుగో వర్ధంతి నాటికి దాన్ని పూర్తిచేస్తామని సీఎం హామీ ఇచ్చారు.