- ఈ నెల 8న కామారెడ్డిలో నామినేషన్
- నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ
- 9న అక్కడే భారీ బహిరంగ సభ
- మైనారిటీ డిక్లరేషన్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీ చేయనున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు రేవంత్ కొడంగల్‌తో పాటు కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి స్థానం నుంచి కూడా బరిలోకి దిగనున్నారు. శనివారం గాంధీభవన్‌లో నిజామాబాద్ జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రటరీలు, పీసీసీ చీఫ్రేవంత్, షబ్బీర్ అలీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కామారెడ్డి బరిలో రేవంత్ ఉంటారని ఠాక్రే స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఏఐసీసీ ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 8న కామారెడ్డిలో రేవంత్ నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తున్నది. శుక్రవారం కొడంగల్ లో తొలి సెట్ నామినేషన్ వేసిన రేవంత్‌రెడ్డి.. సోమవారం రెండో సెట్నామినేషన్వేయనున్నారు. ఇక, రేవంత్ కామారెడ్డి బరిలో ఉంటుండటంతో షబ్బీర్‌అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగనున్నారు.
ఆదివారం షబ్బీర్ అలీ ఆ నియోజకవర్గ నాయకులతో సమావేశం కానున్నారు. నామినేషన్ఎప్పుడు వేసేదీ అప్పుడే తేల్చనున్నారు. షబ్బీర్‌అలీ నామినేషన్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ కూడా వెళ్తారని సమాచారం. మరోవైపు ఈ నెల 9న నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. అక్కడే మైనారిటీ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సల్మాన్ ఖుర్షీద్ హాజరు కానున్నట్టు సమాచారం.
నేడు థర్డ్లిస్ట్?
కాంగ్రెస్‌పార్టీ మూడో లిస్ట్ ఆదివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. అన్ని స్థానాలకు సంబంధించిన వివరాలను ఇప్పటికే సెంట్రల్ఎలక్షన్ కమిటీకి అందజేసినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర నేతలతో ఒకసారి జూమ్‌లో సమావేశమై చర్చించాక ఆదివారం మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉన్నది.
కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ స్థానాలు దాదాపు ఖరారైపోయిన నేపథ్యంలో.. మిగతా17 స్థానాలపైనే కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. సీపీఎం, సీపీఐ పొత్తులు ఎటూ తేలకపోవడం, సీపీఎం తాను పోటీ చేసే స్థానాలను ప్రకటించడంతో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లే ప్రకటించే అవకాశం ఉంది.