సింగరేణిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా సంస్థ అభివృద్ధి, సంక్షేమానికి సీఎం రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తొమ్మిది ఏండ్లు తిష్ట వేసుకుని కూర్చున్న అధికారిని సీఎండీగా తొలగించి జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సంస్థను అవినీతి, అక్రమాల నుంచి దూరంగా ఉంచే పనిని సీఎం రేవంత్ మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నది.135 ఏండ్ల చరిత్ర గల తెలంగాణ గుండె సింగరేణికి అత్యంత సామాన్యుడు ఎన్. బలరాం సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టాడు. ఒకప్పుడు ఆటో నడుపుతూ, తెలంగాణ రాజధాని నగరంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కష్టపడి చదువుకుని బలరాం ఐఆర్ఎస్ అధికారి అయ్యాడు. గరీబు తండాలో పుట్టి పెరిగి కడు పేదరికంను ఎదుర్కొన్నాడు.
ఆకలి, కష్టం అంటే తెలిసినోడు. సింగరేణికి రైల్వే నుంచి డెప్యూటేషన్ మీద ఫైనాన్స్ డైరెక్టర్ గా వచ్చి, డైరెక్టర్ పర్సనల్ బాధ్యతలను అయన నిర్వహిస్తున్నాడు. సింగరేణి ప్రాజెక్ట్స్, ప్లానింగ్ డైరెక్టర్ బాధ్యతను కూడా గతంలో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పలుగు, పార పట్టి వేలాది మొక్కలను నాటారు. తొమ్మిది ఏండ్ల పాటు సీఎండీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి నడిమెట్ల శ్రీధర్ వ్యవహారం వివాదాస్పదంగా ఉండేది. అయన రాజకీయ నాయకులను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తప్ప, కార్మికులను, కార్మిక నాయకులను కలిసేవాడు కాదు.
అనేక అవినీతి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దేశంలో మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణిలో జరిగిన ప్రమాదాలలో కార్మికులు మరణిస్తే వారి పట్ల సానుభూతి చూపలేదు. ఎంత పెద్ద ప్రమాదం అయినా స్పాట్ కు వెళ్లేవాడు కాదు. సీఎంగా కేసీఆర్ప్రమాణం చేసిన నాటి నుంచి దిగిపోయే దాకా శ్రీధరే సింగరేణి సీఎండీగా ఉన్నాడు.
బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు వారి చెప్పు చేతల్లో సింగరేణిని పెట్టారనే విమర్శలు ఉన్నాయి. సింగరేణి నిధులను కూడా ఇతర నియోజకవర్గాలకు మళ్లించాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించిన వారిపై మీద కక్ష సాధింపులు, ఓబీ కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బందుల పాలుచేసి, వారి నుంచి నజరానాలు తీసుకున్న ఆరోపణలు ఉన్నాయి. సంస్థ లాభాలను కాగితాలకు పరిమితం చేశాడు.
సలహాదారులుగా రిటైర్డ్ ఉద్యోగులు
లక్షల రూపాయల జీతాలు ఇచ్చి రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా మాజీ సీఎండీ తన హయాంలో నియమించుకున్నాడు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి తాను ఉండే అద్దె ఇంటికి భారీగా అద్దె చెల్లించారని, విదేశాలకు టూర్లుకు వెళ్లి ఆ ఖర్చులు సంస్థ మీద వేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాలోని 'నైని' బొగ్గు బ్లాక్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వృథా ఖర్చులు, నేటికీ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాకపోవడం, అటు విజయవాడలో ఉన్న సింగరేణికి చెందిన 'ఆప్మెల్' వివాదం ఇంకా తేలక పెండింగ్లో ఉండడం ఆయన వల్లే అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో సింగరేణిని నీతిగా, నిజాయతీగా నడిపే అధికారిని తాత్కాలికంగా అయినా ఎంపిక చేయడం అభినందనీయం.
బలరాం లాంటి అవినీతి మరకలేని అధికారికి సీఎండీగా సీఎం రేవంత్ రెడ్డి అదనపు ఫుల్ ఛార్జ్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం అవుతున్నది. ఆయనను రెగ్యులర్ సీఎండీగా కనీసం రెండు ఏండ్లు కొనసాగించాలి. తద్వారా సంస్థ చాలా విషయాలలో గాడిన పడే అవకాశం ఉంటుంది. సంస్థ ఆర్థికశాఖ ను చూస్తున్న అధికారి కాబట్టి సంస్థకు ఉపయోగకరం. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్ ఠాకూర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరుల సూచన, సలహా మేరకు సీఎండీ మార్పు జరిగినట్లు తెలుస్తున్నది.
- ఎండి మునీర్, సీనియర్ జర్నలిస్ట్