కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అందులో కేసీఆర్, కేటీఆర్, కవిత హరీశ్ రావు కూడా ఉండొచ్చన్నారు. భూదాన్ భూములపై ధరణి వచ్చాకా నిషేదం ఎత్తేశారని.. భూదాన్ భూములన్నీ కేటీఆర్ అనుచరులు కొట్టేశారని ఆరోపించారు. వెయ్యి కోట్ల రూపాయల భూములు కేటీఆర్ అనుచరులు కొట్టేస్తున్నారని ఆరోపించారు. ధరణి సమస్యలు క్లియర్ కావాలంటే 30% కమిషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ధరణి విషయంలో కేసీఆర్ పెద్ద దళారీ అని విమర్శించారు.
తిమ్మాపూర్ భూ కుంభకోణంలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతలున్నారని ఆరోపించారు రేవంత్. కలెక్టర్లు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయడం లేదన్నారు.రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ కలిసి తిమ్మాపూర్ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. తిమ్మాపూర్ భూదాన్ భూములపై ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 23వేల ఎకరాల భూదాన్ భూములున్నాయన్నారు. తన గ్రామం తిమ్మాపూర్ లో భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పారదర్శకంగా భూ రికార్డులు ఉండేవన్నారు రేవంత్ రెడ్డి. 2004లో కాగితపు రికార్డులు భూ భారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటలైజ్ చేసిందన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దుచేసి ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తెస్తామన్నారు రేవంత్ రెడ్డి. ధరణి అనేది కేసీఆర్ కి బంగారు గుడ్డు పెట్టే బాతులాగా మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ భూములపై విచారణ జరిపిస్తామన్నారు.