బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం విధ్వంసం: సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం విధ్వంసం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్/ మహబూబ్​నగర్​/ మక్తల్/ షాద్​నగర్​, వెలుగు : బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుందని, వందేండ్లు వెనక్కి పోతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘గుజరాత్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంలా ఉండాలని, తెలంగాణ మాత్రం మతకల్లోలాలతో నాశనం కావాలని గుజరాత్ బ్యాచ్ కుట్రలు చేస్తున్నది. హైదరాబాద్​లో శాంతిభద్రతల సమస్యను సృష్టించి ఇక్కడి నుంచి పెట్టుబడులను గుజరాత్​కు తరలించేందుకు ప్లాన్​ వేసింది” అని ఆయన ఆరోపించారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ సామరస్యంతో బతుకుతున్న తెలంగాణలో మతచిచ్చు రేపాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్​లో, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్​లో, హైదరాబాద్​లోని గోషామహల్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. 

బీజేపీతో బీఆర్​ఎస్​ ఒప్పందం

‘‘70 ఏండ్ల తర్వాత పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే జీర్ణించుకోలేక శత్రువులతో చేతులు కలిపి మా ప్రభుత్వాన్ని కూలదోయడానికి మహబూబ్​నగర్​ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రయత్నిస్తున్నరు” అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  ‘‘తులసి వనం లాంటి పాలమూరులో గంజాయి గడీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి. కేసీఆర్ తన బిడ్డ కవిత బెయిల్ కోసం ఈ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు పడేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా.. బీఆర్ఎస్ కార్యకర్తల్లారా.. వాస్తవాలు గ్రహించండి. బిడ్డ బెయిల్​ కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి పణంగా కేసీఆర్​ పెడ్తున్నడు. బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో మతోన్మాదం పెచ్చుమీరిపోతుంది. పెట్టుబడులు గుజరాత్ కు, అల్లర్లు తెలంగాణకు మిగులుతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ నాయకుల కుట్రలను ప్రజలు కనిపెట్టాలని అన్నారు. 

మోదీ.. ఎవరి చరిత్ర ఏందో తెలుసుకోకపోతే ఎట్ల?

డీకే అరుణ కుటుంబ చరిత్ర ఏంటో తెలుసుకుని పాలమూరు గడ్డపై ప్రధాని మోదీ కాలు మోపి ఉంటే బాగుండేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  ‘‘పాలమూరు తులసి వనంలో గంజాయి మొక్కలా పెరిగిన డీకే కుటుంబం గురించి, గద్వాల గడిలో జరిగిన అన్యాయాల గురించి తెలుసుకున్న తర్వాతే పాలమూరు గడ్డపై మోదీ అడుగుపెట్టాల్సింది. కల్తీకల్లు, దొంగసారా, కాంట్రాక్టులు, కమీషన్లు, కంకర వ్యాపారం ఇంకా ఎన్నో చీకటి వ్యాపారాలు చేస్తున్న డీకే కుటుంబ చరిత్ర గురించి తెలుసుకోకుండా వాళ్లని పక్కన పెట్టుకుని నారాయణపేట సభలో నన్ను విమర్శించడం ప్రధానికి తగదు” అని ఆయన పేర్కొన్నారు. ‘‘షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా మోదీకి సవాల్ చేస్తున్నా..! ఎవరి చరిత్ర ఏమిటో బ్యాలెట్ బాక్స్ నిర్వహిద్దాం. డీకే చరిత్రను, నా చరిత్రను బ్యాలట్ బాక్స్ లో ప్రజల మధ్యలో పెట్టి తేల్చుకుందాం. దమ్ముంటే ప్రధాని ముందుకు రావాలి” అని అన్నారు. ప్రధాని మోదీ  పాలమూరు జిల్లాకు వచ్చి ఏం ఒరగపెట్టారని ఆయన ప్రశ్నించారు. ‘‘పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇచ్చారా? లేక లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు హామీ ఇచ్చారా? భీమా నెట్టెంపాడు, సంగంబండ తదితర ప్రాజెక్టులకు మేలు చేశారా?” అని నిలదీశారు.  

ఎంపీ ఎన్నికల తర్వాత ‘లోకల్’​ ఎలక్షన్స్​

లోక్​సభ ఎన్నికలు అయిపోయిన వెంటనే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్​ తెలిపారు. ‘‘లోక్​సభ ఎన్నికల్లో బూత్​ లెవెల్​లో ఎవరైతే మెజార్టీ తెస్తారో వాళ్లకు సర్పంచ్​, ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి గెలిపించుకుంటాం” అని కాంగ్రెస్​ లోకల్​ లీడర్లకు ఆయన హామీ ఇచ్చారు.  ‘‘వంశీచంద్​రెడ్డి ఢిల్లీలో సీడబ్ల్యూసీ మెంబర్. అవసరం అనుకుంటే ఒక్క సంతకంతో ఆయన్ను రాజ్యసభకు పంపించే శక్తి ఉంది. కానీ, ఈ ప్రాంత ప్రజల ద్వారా ఎన్నికై ఢిల్లీకి పోతే ఈ ప్రాంత సమస్యలపై కొట్లాడి, పరిష్కస్తడు. మహబూబ్​నగర్​ ఎంపీగా ఆయనను గెలిపించండి” అని కోరారు. మహబూబ్​నగర్​ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే పాలమూరు ప్రజల తరపున ఆయన సిఫాయిలా నిలబడతారని, డీకే అరుణను గెలిపిస్తే ఢిల్లీ సుల్తానుల వద్ద పాలమూరు ప్రజల పౌరుషాన్ని తాకట్టు పెడతారని ఆయన అన్నారు. 

జుమ్మెరాత్ బజారుకు కారు..

‘‘నాడు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పాలమూరుకు వలస వచ్చిన కేసీఆర్ ను పాలమూరు ప్రజలు పల్లకిలో పార్లమెంటుకు పంపించారు. పదేండ్లు సీఎంగా ఉండి ఆయన పాలమూరు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు” అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. పదేండ్ల అన్యాయాలపై ఉద్యమించి పాలమూరు బిడ్డగా తాను ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు. ‘‘100 రోజులు గడిచిన మా ప్రభుత్వంపై కేసీఆర్, బీజేపీ నేతలు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేస్తున్నరు” అని అన్నారు.  జహంగీర్ పీర్ దర్గా సాక్షిగా ఆగస్టు 15 లోపే రైతులకు రుణమాఫీ చేస్తామని, ఆ తర్వాత కేసీఆర్​ను వదిలే ప్రసక్తి లేదని తెలిపారు. ‘‘బీఆర్​ఎస్​ కారు గ్యారేజీకి పోయింది. త్వరలోనే జుమ్మెరాత్ బజారుకు కూడా పోతది. మే 9 వరకు రైతు భరోసా వేస్తానని నేను చెప్పిన. అంతలోపే వేసినం. ఇప్పుడు కేసీఆర్​ ముక్కు నేలకు రాస్తడా? ” అని ఆయన ప్రశ్నించారు. ముదిరాజ్ ప్రజలను బీసీ డీ నుంచి ఏ కేటగిరీలోకి మార్చుతామని,  ఎస్సీ వర్గీకరణ చేపడతామని ఆయన అన్నారు.  

పాతబస్తీ తలరాత మారుస్తం

ఈ ఎన్నికల్లో హైదరాబాద్​ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సమీర్​ వలీవుల్లాను గెలిపిస్తే పాతబస్తీ తలరాతను మారుస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘బీజేపీ, ఎంఐఎం పార్టీలు హైదరాబాద్​లో మళ్లీ మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కాంగ్రెస్​ పార్టీని గెలిపించాలి” అని కోరారు. శుక్రవారం గోషామహల్​ ఏరియాలో నిర్వహించిన రోడ్​ షోలో సీఎం రేవంత్​ మాట్లాడారు.  ‘‘నగరంలో అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్​తోనే సాధ్యం. మూసీని సుందరంగా మార్చాలన్నా, పాతబస్తీలో మెట్రోరైల్​ రావాలన్నా, బడుగు వర్గాలకు ఉపాధి అవకాశాలు రావాలన్నా కాంగ్రెస్​ పార్టీని గెలిపించాలి. ఈసారి మైనారిటీలంతా కాంగ్రెస్​కు అండగా నిలబడాలి” అని సీఎం కోరారు.