111జీవో పరిధిలో కేసీఆర్ ఫ్యామిలీకి భూములు : రేవంత్ రెడ్డి

111జీవో పరిధిలో కేసీఆర్ ఫ్యామిలీకి భూములు : రేవంత్ రెడ్డి

111 జీవో ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నారు. భూములు కొనుగోలు చేశాక జీవో ఎత్తివేశారని విమర్శించారు.  111 జీవో ఎత్తివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామని స్పష్టం చేశారు.  2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో భూముల క్రయ విక్రయాల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.  ఔటర్ రింగురోడ్డును ముంబైకి చెందిన IRB సంస్థకు అమ్మారlr..ORR ను అప్పనంగా ప్రైవేటు కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. సింగపూర్ సంస్థ ఫ్రంట్ ఎండ్లో ఉండి వాటా కొనుగోలు చేసిందన్నారు.

ఓఆర్ఆర్ టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకు జరిగిన అక్రమాలను కాంగ్రెస్ చెబుతూ వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. టెండర్ సాధించిన వారికి  అగ్రిమెంట్ లెటర్ తర్వాత 30 రోజుల్లో 10 శాతం చెల్లించాలన్నారు. రూ. 738 కోట్లను 30  రోజుల్లో IRB సంస్థ HMDA కు చెల్లించాలని పేర్కొన్నారు. మే 26వ తేదీ వరకు IRB సంస్థ 10శాతం హెచ్ఎండీఏ కు చెల్లించపోతే టెండర్ వెంటనే రద్దు చేయాలన్నారు. 10శాతం కట్టకుండానే ఎందుకు పొడిగింపు ఇస్తున్నారని ప్రశ్నించారు. సీఎస్ సోమేశ్ కుమార్, HDA కమిషనర్  అరవింద్ కుమార్ ఈ తతంగమంతా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కుమార్, కేసీఆర్, కేటీఆర్ కు తాబేదారా అని అన్నారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే HMDAను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈడీ, కాగ్ సంస్థలకు తమ దగ్గరున్న సమాచారం ఇస్తామన్నారు. ఇంత అవినీతి జరుగుతున్నా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.  ఔటర్ రింగ్ రోడ్డుపై కిషన్ రెడ్డి మాట్లాడి వదిలేశారన్నారు.