స్వరాష్ట్రంలోనూ ప్రాజెక్టు నిర్మాణాల్లోనూ నిర్లక్ష్యం : రేవంత్ రెడ్డి

స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులను స్వయంగా సందర్శించిన సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేశాడని మండిపడ్డారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, పూర్తి చేసేది కూడా తమ పార్టీనే అని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పదవి విరమణ, రాజకీయ విరమణ చెప్పారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు బై బై చెప్పి, కాంగ్రెస్ కు స్వాగతం చెప్పాలని ప్రజలకు కోరుతున్నట్లు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గండిపల్లి ప్రాజెక్టును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు.

‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో భాగంగా హుస్నాబాద్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. సాయంత్రం హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించే మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. 

అంతకుముందు.. కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం సర్వాయిపేటలోని సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహానికి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కోటను సందర్శించారు.