- నన్ను ఒంటరివాన్ని చేసి పీసీసీ నుంచి తొలగించే ప్లాన్
- కార్యకర్తలంతా లక్షలాదిగా మునుగోడుకు తరలిరండి
నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మునుగోడు మండలం కొంపల్లిలో పలు మీడియా చానళ్లతో మాట్లాడారు. ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గర సుపారీ తీసుకుని కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడానికి పథకం వేశారని ఆరోపించారు. తనను ఒంటరి వాడిని చేసి పీసీసీ నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనికి సొంత పార్టీలోని కొందరు సహకరిస్తున్నారని, త్వరలోనే వారి వివరాలు బయటపెడతానన్నారు. ఈ కష్టసమయంలో తనను, కాంగ్రెస్ ను అభిమానించే కార్యకర్తలు లక్షలాదిగా మునుగోడుకు తరలివచ్చి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ సమస్యలపైన ఈ నెల 26,27 తేదీ ల్లో దీక్ష చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు.
కుర్చేసుకుని ప్రాజెక్టులు కడతా అన్నడు కదా..
చండూరు : చర్లగూడెం, లక్ష్మణపురం ప్రాజెక్టులను కుర్చీ వేసుకొని కూర్చుని పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ పోయాడని, ఎప్పుడు పూర్తి చేస్తాడో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మర్రిగూడ మండలంలో పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. పొగబెట్టిన ఎలుకల్లా..టీఆరెస్, బీజేపీలు కలుగులో నుంచి బయటకు వచ్చాయని, తాగడానికి గంజి లేని టీఆర్ఎస్ వాళ్లు ఈరోజు బెంజి కార్లలో తిరుగుతున్నారన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో మంత్రులు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పని చేసిన లీడర్లు నిజాయితీగా పనిచేశారని, ఇప్పుడూ అదే నిజాయితీతో పని చేస్తున్నారన్నారు. మంత్రులు మందు పోస్తున్నారంటే..ఇంతకంటే దివాళ కోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ‘పైసలున్నోళ్లకు కాదు.. ప్రజలకు సేవ చేస్తుందనే స్రవంతికి టికెట్ ఇచ్చాం. మేం సీసాలు, పైసలు పంచలేం, ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసే స్థాయికి కాంగ్రెస్ దిగజారదు’ అని అన్నారు. ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
కొంపల్లిలోనే రేవంత్ మకాం...
మునుగోడు మండలం కొంపల్లిలో తన సమీప బంధువు మేఘా రెడ్డి ఇంట్లో రేవంత్ బస చేశారు. ఐదారెకరాలు ఉన్న ఈ గెస్ట్‌హౌస్‌లో ప్రతి రోజు వెయ్యి మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో పార్టీ తరపున జరుగుతున్న సర్వేల ఆధారంగా ఎప్పటికప్పుడు పార్టీ స్థితిగతులపై నాయకులతో సమీక్షలు చేస్తున్నారు. జోడో యాత్రలో భాగంగా మునుగోడు నుంచి భారీ జనసమీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ఆ పార్టీ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క గురువారం నుంచి మునుగోడులో ఎన్నికల ప్రచారం వేగవం తం చేశారు. ప్రస్తుతం జోడో యాత్రలో పాల్గొంటున్న పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే చౌటుప్పుల్ రూరల్ మండలంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.