కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ క్షమాపణ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చేప్పారు. చండూర్ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే గౌరవం ఉందన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు. హోంగార్డు ప్రస్తావనపై కూడా వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ‘‘ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదు.. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేస్తున్నాను’’ అని ఆయన వెల్లడించారు.  

రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడారని..  క్షమాపణలు చెప్పాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  ఇటీవల డిమాండ్ చేశారు. ‘రాజగోపాల్ రెడ్డి ఆయనకు ఇష్టమున్న పార్టీలోకి వెళ్తున్నారు.. రేవంత్ రెడ్డి నన్ను ఇందులోకి అనవసరంగా లాగొద్దు’ అని హెచ్చరించారు. ‘పార్టీ ఏది ఆదేశిస్తే అది పాటిస్తా’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కోమటిరెడ్డి బ్రదర్స్ పై రేవంత్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ లేకపోతే బ్రాండ్ లేదు.. బ్రాందీ షాపులో పనిచేసేవారని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై సీరియస్ అయిన వెంకట్ రెడ్డి .. రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే రేవంత్ క్షమాపణ అంగీకరించేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.  పార్టీ నుంచి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాల్సిందేనన్నారు. సస్పెండ్ చేస్తేనే... మునుగోడులో ప్రచారానికి వెళ్తానని తెలిపారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమాాషా అనిపిస్తుందా.. చిన్న పిల్లాడిలా మాట్లాడారని చెప్పారు. సారీ చెప్తే సరిపోదని కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు మునుగోడులో ప్రచారానికి తనకు ఆహ్వానం లేదని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పిలవని పేరంటానికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. పార్టీలోని ఐపీఎస్ లాంటి పెద్దలే మునుగోడులో గెలిపిస్తారని కామెంట్ చేశారు. పార్టీ నుంచి ఒక్కొక్కరిగా వెళ్తున్నా పట్టించుకోవడం లేదని.. తనను మునుగోడులో అనరాని మాటలు అనిపించారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రేవంత్ వ్యాఖ్యల్లో ‘మీరు’ అని సంబోధించడం బాధించిందని.. 34 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి జీవితాన్ని అంకితం చేశానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని.. నన్ను అనవసరంగా విమర్శించారని అన్నారు. ‘మీరు’ అనే పదాన్ని వాడారని.. మేం సొంతంగా కష్టపడి పైకి వచ్చామని ఆయన అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మొత్తానికి రేవంత్ ఇవాళ బహిరంగ క్షమాపణ చెప్పారు.