జమిలి ఎన్నికలతో.. బీజేపీ దేశాన్ని కబళించాలని చూస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

జమిలి ఎన్నికలతో.. బీజేపీ దేశాన్ని కబళించాలని చూస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని.. ఇలాంటి సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల మధ్య ఐక్యత దెబ్బతీసే కుట్ర జమిలి ఎన్నికల రూపంలో ఇప్పుడు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్ ను దెబ్బతీసేందుకే బీజేపీ ఈ ఎన్నికల కుట్ర చేస్తోందన్నారు. జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి ప్రజాస్వామిక వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయడానికి సీతారాం లేకపోవడం బాధకరమని విచారం వ్యక్తం చేశారు.

రవీంద్రభారతిలో శనివారం జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. చనిపోయాక కూడా ప్రజలకు ఉపయోగపడ్డ గొప్ప నేత సీతారం ఏచూరి అని కొనియాడారు. దేశంలో ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు అని గుర్తుచేశారు. రైట్ టూ ఇన్ఫర్మెషన్ యాక్ట్ తీసుకురావడంలో ఆయన కృషి గొప్పదని వివరించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కమ్యూనిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు. ఉపాది హామి, ఆహార భద్రత పథకాలు కమ్యూనిస్టుల ఆలోచనలతోనే వచ్చాయన్నారు.