రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్త

కాంగ్రెస్ పై బీజేపీ కుట్రలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఉప ఎన్నికల ప్రచారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తన అడ్డు తొలగించుకునేందుకు కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టారని ఆరోపించారు. జైలుకెళ్లానని గర్వంగా చెప్పుకుంటానన్న రేవంత్.. పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లానే తప్ప దొంగతనం చేసి జైలుకు పోలేదని చెప్పారు. పేదల కోసం ఒక్కసారి కాదు.. వంద సార్లైనా జైలు కెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. తాను తిన్న చిప్పకూడు సాక్షిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ ధీమా వ్యక్తంచేశారు. 

గోతికాడి నక్కల్లా బీజేపీ, టీఆర్ఎస్
కాంగ్రెస్ ఆశావహులు పార్టీ మారతారని బీజేపీ, టీఆర్ఎస్ గోతి కాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు పట్టాలిస్తే కేసీఆర్ ఈ భూముల్ని గుంజుకుంటున్నడని ఆరోపించారు. మునుగోడులోని గ్రామాలకు సరైన రోడ్లు వేయని వారు.. ఇక్కడ అభివృద్ధి చేస్తరా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి ఏం చేయని వారికి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. గతంలో కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల కోసం వాళ్ల కాళ్లు పట్టుకుంటున్నారని చురకలంటించారు. బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచినందుకు వేయాలా అని ప్రశ్నించారు. చంటిపిల్లల పాలపై కూడా జీఎస్టీ వేసిన ఘనత కేవలం బీజేపీ దక్కుతుందని అన్నారు.

మునుగోడు కాంగ్రెస్ జెండా ఎగురేస్త

తెలంగాణ ఇచ్చినందుకు, గిరిజనులకు భూములు పంచినందుకు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు. జనంలో ఒకడినైన  తనను పీసీసీ అధ్యక్షుడిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రేవంత్ అన్నారు. ఒకప్పుడు తాను టీడీపీ సభ్యున్ని అయినా.. ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తినని చెప్పారు. అప్పట్లో బిడ్డగా టీడీపీ గౌరవం నిలబెడితే.. ఇప్పుడు కోడలిగా కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడుతానని రేవంత్ స్పష్టం చేశారు. ఓటర్ల మద్దతుతో మునుగోడులో పేదల నేస్తం అయిన కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేశారు.