మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీకి చమురు కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా..? కార్పొరేట్లకు ప్యాకేజీలు ఇస్తూ ప్రజలపై సబ్సిడీ భారాలు మోపుతున్నారని.. బీజేపీ ఘోరాలను సహించబోమంటూ తీర్మాణాలు చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడంపై రేవంత్ రెడ్డి  స్పందించారు. 

‘‘ఐదేండ్లు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని మీరు.. మునుగోడు ఉప ఎన్నికలో.. ఒక ఆడబిడ్డను ఓడించడానికి వందల కోట్ల రూపాయలతో... వేల మంది వందిమాగదులతో దండయాత్ర కాకుండా..  నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట నర్సింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా…? అని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో  ప్రశ్నించారు. 

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేసింది మొదలు ఇప్పటి వరకు ఆమెకు అండగా ఊరూరా ప్రచారాన్ని నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.. కార్యకర్తలు, ఎన్ఎస్ యూఐ విద్యార్థి సంఘాల నాయకులు, సభ్యులు ఇంటింటి ప్రచారం చేయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు 38 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఎండగడుతూ.. తాము ఏం చేస్తామో వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.