తెలంగాణ రాజకీయాలను అంగడి సరుకులా మార్చిండు : రేవంత్ రెడ్డి

  • తెలంగాణ రాజకీయాలను అంగడి సరుకులా మార్చిండు
  • సీఎం కేసీఆర్‌‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
  • ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు సిద్ధమా?
  • 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలను కొన్నదెవరు?
  • తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని వ్యాఖ్య
  • కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్

కామారెడ్డి, వెలుగు : ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని సీఎం కేసీఆర్‌‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ రాజకీయాలను అంగడి సరుకులా మార్చిందే కేసీఆర్ అని మండిపడ్డారు. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా శుక్రవారం రేవంత్ నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో ఆయన మాట్లాడారు.‘‘కామారెడ్డి గడ్డ మీది నుంచి సవాలు విసురుతున్నా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీల కొనుగోళ్ల మీద సీబీఐ, ఈడీ విచారణకు నేను సిద్ధం.. నీవు సిద్ధమా కేసీఆర్? విచారణకు సిద్ధమైతే 24 గంటల్లో లేఖ రాయి. లేకపోతే కామారెడ్డి చౌరస్తాలో ముక్కు నేలకు రాయి” అని చాలెంజ్ చేశారు. తనపై విమర్శలు చేస్తున్న కేసీఆర్.. టీడీపీ, కాంగ్రెస్, వైస్సార్‌‌సీపీ, సీపీఐ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, ఇద్దరు ఎంపీలను సంతలో పశువుల లెక్క తీసుకున్నారని, ఎవరెవరికి ఎన్ని కోట్లు ఇచ్చారని నిలదీశారు. ‘‘మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్, మల్లారెడ్డి గతంలో ఏ పార్టీలో గెలిచారు? ఏ పార్టీలో మంత్రులుగా ఉన్నారు? 

రాష్ట్రాన్ని కొనుగోలు కేంద్రంగా మార్చిందే నీవు.. సర్వ నాశనం చేసిందే నీవు. గంప గోవర్ధన్ ఏ పార్టీలో ఉండె? ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ఏ పార్టీలో గెలిచిండు? వీళ్లు ఎవరికి అమ్ముడుపోయారు? ఇయ్యాల నీవు వచ్చి అమ్ముడు, కొనుగోళ్ల గురించి చెప్తావా?” అని కేసీఆర్‌‌పై నిప్పులు చెరిగారు. తాను 20 ఏండ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశానని, అధికారం కోసం అమ్ముడుపోలేదని,  కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడలేదని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని అన్నారు.

వందల కోట్లు కొల్లగొట్టారు

‘‘కామారెడ్డి ప్రాంతానికి చెందిన రైతు లింబయ్య 2015లో సచివాలయం ఎదుట ట్రాన్స్​ఫార్మర్​కు ఊరివేసుకొని చనిపోయాడు. తన గోడు చెప్పుకుందామని పోతే బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం, సచివాలయానికి పోతే సీఎం కలవకపోవడంతో దిక్కు తోచక ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఫ్యామిలీ గొడవలని రిపోర్టు ఇచ్చారు. మరో రైతు బీరయ్య వడ్ల కుప్పపైనే గుండె అగి చనిపోయారు. అప్పుడు కేసీఆర్ రాలే. బీఆర్ఎస్ లీడర్లు రాలే. కానీ ఇయ్యాల వచ్చి ‘నాది కొనాపూర్.. మా అమ్మ ఇక్కడే పుట్టింది’ అని కేసీఆర్ చెప్తున్నారు. కొనాపూర్, కామారెడ్డి ఇవ్వాళ గుర్తుకు వచ్చిందా?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్‌ను బంగారు తునక లెక్క చేసి ఉంటే  కామారెడ్డికి ఎందుకు వస్తారని నిలదీశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల్లో గజ్వేల్​రైతులను ముంచారని మండిపడ్డారు. కేసీఆర్ చుట్టాల భూములను ముట్టకుండా.. రంగనాయక సాగర్‌‌లో పేద రైతుల భూములను ముంచారని ఆరోపించారు. మల్లన్న సాగర్ భూ సేకరణలో వందల కోట్లు కొల్లగొట్టారని ఫైరయ్యారు.

నీ ప్రభుత్వమే రద్దయితది 

గజ్వేల్‌లో వెయ్యి ఎకరాలను ఆక్రమించి ఫామ్‌హౌస్‌ను కేసీఆర్ కట్టించుకున్నారని, ఇప్పుడు కామారెడ్డి చుట్టూ ఉన్న భూములపై కేసీఆర్ కన్ను పడిందని రేవంత్ ఆరోపించారు. ‘‘మాస్టర్ ప్లాన్ పేరు మీద కుట్రతోనే కామారెడ్డికి వచ్చారు. మాస్టర్ ప్లాన్‌ను ఇక్కడి రైతులు తిప్పికొట్టారు. రైతులు దీక్ష చేస్తే రాని సీఎం.. ఓట్లు అవసరం పడగానే కొడుకును పంపి మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యిందని చెప్పారు. నీవు మాస్టర్ ప్లాన్ రద్దు చేసుడేంది. నీ ప్రభుత్వమే రద్దయితది’’ అని అన్నారు. 10 ఏండ్లలో ఏం చేశారని మూడో సారి కేసీఆర్​ను సీఎం చేయాలని ప్రశ్నించారు. లక్షల కోట్లు సంపాదించినందుకా? వేల ఎకరాల భూములు ఆక్రమించినందుకా? అని ప్రశ్నించారు. ఇప్పటికే కేసీఆర్ ఇంట్లో వాళ్లందరికీ పదవులు వచ్చాయని, మూడో సారి సీఎం చేస్తే మనవడిని మంత్రిని చేస్తారని సెటైర్లు వేశారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచుకున్నారని, మేడిగడ్డ భూమిలోకి కుంగిపోయిందని అన్నారు.

15 మంది తెలంగాణ వ్యతిరేకులే: నారాయణ

బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, కలిసి నాటకాలు ఆడుతున్నాయని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతున్నదని ఆరోపించారు. రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది తెలంగాణ వ్యతిరేకులేనని విమర్శించారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని, కామారెడ్డిలోనే కేసీఆర్‌‌ను ఓడించాలని చెప్పారు. ఇక్కడ దెబ్బకొడితే కేసీఆర్ ఇక జీవితంలో ఫామ్​హౌస్‌ నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. మనకు ఈ నియంతృత్వ ప్రభుత్వం వద్దని, ప్రజా ప్రభుత్వం కావాలని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ‘‘ఎనీ టైం సీఎంను కలిసే ప్రజా దర్బార్​ప్రభుత్వం కావాలి. అది కాంగ్రెస్​తోనే సాధ్యమవుతుంది. అందరికీ ఇళ్లు, పింఛన్లు ఆనాడే వచ్చాయి. కేసీఆర్​ హయాంలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా?” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్​తోనే న్యాయం: పొన్నం ప్రభాకర్

బీసీలకు కాంగ్రెస్​తోనే న్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘బీసీని సీఎం చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్రంలో 10 ఏండ్లలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా.. ఇప్పుడు సీఎం చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదం. బీజేపీ డిపాజిట్లు పోయే పార్టీ. అలాంటి పార్టీ నుంచి బీసీని సీఎం చేస్తామని అనడమంటే బీసీలను అవమానించడమే” అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ డిక్లరేషన్‌ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​గౌడ్‌ ప్రకటించారు. కేసీఆర్ అమ్మ ఊరు కొనాపూర్ వాసులు రూ.11 వేల విరాళాన్ని రేవంత్​రెడ్డి నామినేషన్‌ కోసం అందించారు.

కేసీఆర్‌‌ను ఓడిస్తేనే అమరుల త్యాగాలకు అర్థం: కోదండరాం

తొమ్మిదిన్నరేండ్ల  కేసీఆర్ పాలన చూసి ప్రజల గుండె రగిలిపోతున్నదని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘‘ఊర్లో పచ్చని భూములు ఉంటే ఎట్లా గుంజుకోవాలనే ఆలోచన కేసీఆర్ చేస్తుండు. ఇసుక దందా వాళ్లదే. కాంట్రాక్టులు వాళ్లవే. ఒక్క  కుటుంబం తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైందో కళ్ల ముందు కనిపిస్తున్నది. కమీషన్ల కోసం ఆలోచించారు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి పట్టింది” అని మండిపడ్డారు. కేసీఆర్ భర్తీ చేస్తామన్న 80 వేల  ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడ్డారని, కానీ ప్రభుత్వం పేపర్లను అమ్ముకున్నదని ఆరోపించారు. పరీక్షలు వాయిదా పడ్డాయని చెప్పారు. ‘‘ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు ఎవరితోనే సంబంధం అంటగట్టిండు కేటీఆర్. మీ స్వార్థం కోసం బాధిత యువతి వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, కేసీఆర్‌‌కు మధ్య వేరే పంచాయితీ ఏం లేదని, కానీ ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి ఇది కాదని అన్నారు. న్యాయం చెప్పే అధికారం కామారెడ్డి ప్రజలకు వచ్చిందని, సరైన తీర్పు చెప్పాలని కోరారు. కేసీఆర్‌‌ను ఓడిస్తేనే అమరుల త్యాగాలకు అర్థంమని చెప్పారు.

అవినీతి డబ్బుతో గెలవాలని చూస్తుండు: సిద్ధరామయ్య

సభకు ముఖ్య అతిథిగా హాజరైన కర్నాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో గ్యారంటీ స్కీమ్‌లు అమలు కాలేదని కేసీఆర్​ అంటున్నారని, ఆయన కర్నాటకకు వస్తే తన గదిలో కూర్చోబెట్టి ఏ గ్యారంటీకి ఎంత కేటాయించామో చెప్తానని చెప్పారు. ‘‘కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో నాలుగు పక్కాగా అమలు చేస్తున్నాం. యువతకు సంబంధించిన గ్యారంటీని జనవరి నుంచి అమలు చేస్తాం” అని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ అవినీతి సర్కారును ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.