- ఓటమి భయంతోనే అడ్డగోలుగా మాట్లాడుతున్నవ్ : రేవంత్
- దమ్ముంటే మేడిగడ్డ చూపించి ఓట్లు అడగాలని సవాల్
ధర్పల్లి/ సంగారెడ్డి/ నారాయణ్ ఖేడ్/గజ్వేల్, వెలుగు : కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 80 సీట్లు ఇస్తరు.. డిసెంబర్3న లెక్కపెట్టుకో కేసీఆర్... 80 కన్నా ఒక్క సీటు తక్కువొచ్చినా నువ్వు వేసే శిక్షకు సిద్ధంగా ఉంటా’’ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్‌కు తన పదవి ఊడిపోతుందని అర్థమైందని, మతి తప్పి కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, 20 సీట్లు కూడా రావని చెప్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన సభలతో పాటు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్, మూసాపేటలో కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను చూపించి మేము ఓట్లు అడుగుతాం..
కూలిన మేడిగడ్డ బ్యారేజీని చూపి ఓట్లు అడిగే దమ్ము మీకుందా’ అని నిలదీశారు. అబద్ధాలు చెప్పడంలో ప్రపంచంలోనే కేసీఆర్ నంబర్ వన్ అని, దేవుళ్లను కూడా మోసం చేస్తారన్నారు. కుర్చీ వేసుకుని బసవేశ్వర ప్రాజెక్టు, నల్లవాగు చెక్ డ్యాం కడతానంటాడు.. ఆ తర్వాత ఫామ్ హౌస్ లో పండుకుంటాడని ఎద్దేవా చేశారు. ‘‘బక్కొడ్ని చూసి దాడి చేయడానికి కాంగ్రెస్ వస్తుందంటున్నావు. బక్కోడికి బుక్కెడు బువ్వ చాలదా? రూ.లక్ష కోట్లు ఎలా మింగినవ్. 10 వేల ఎకరాలను ఎలా ఆక్రమించినవ్’’ అని ప్రశ్నించారు. మింగడానికి కల్వకుంట్ల ఫ్యామిలీ ముందుంటదని, ప్రజల గోస, రైతు కన్నీళ్లు, ఆత్మహత్యలు వారికి కనబడవని విమర్శించారు.
లక్ష కోట్లు కక్కిస్తం
కేసీఆర్ అవినీతి చేసి సంపాదించిన లక్ష కోట్లను కక్కిస్తామని, ఆయన హైదరాబాద్చుట్టుపక్కల దోచుకున్న 10 వేల ఎకరాలన భూములను స్వాధీనం చేసుకుంటామని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను ప్రజలు గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల ఓడించాలన్నారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. రెండేండ్ల కింద దళిత, గిరిజన దండోరా కార్యక్రమంతో కేసీఆర్పతనానికి బాటలు పడ్డాయన్నారు. ‘‘కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా, ప్రజలను కలవక మోసం చేసిండు. మహబూబ్‌నగర్ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెట్టాలనుకుంటే పారిపోయి గజ్వేల్‌కు వచ్చిండు.
ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని తాము బాగుపడతామని రైతులు, విదార్థులు, యువకులు రెండుసార్లు ఎమ్మెల్యేను చేసిండ్రు. కానీ అందర్నీ మల్లన్న సాగర్‌లో ముంచిండు. ఇక్కడ కూడా పాతాళానికి తొక్కాలని ప్రజలు అనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండు. కానీ అక్కడ కూడా అసలైన వేటగాడు ఉన్నడు.. కేసీఆర్‌ను ఓడించటానికి అక్కడి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు’’ అని రేవంత్అన్నారు. ప్రజలు కేసీఆర్‌ను ఓడగొడితే.. అభివృద్ది చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం.. ముంపు బాధితులకు సరైన పరిహారం ఇస్తామన్నారు.
కవితను ఓడగొట్టారని కేసీఆర్ కక్ష గట్టిండు
కాంగ్రెస్ వస్తే రైతుబంధు ఉండదని కేసీఆర్ అంటున్నాడని, రైతు భరోసా ద్వారా రైతుకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని, కౌలు రైతులకు సాయం చేస్తామని రేవంత్ చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్ల రాజ్యమన్నారు. ఎర్రజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర అందించలే దని నిజామాబాద్ ప్రజలు కవితను బండకేసి కొట్టారని, ఎంపీ ఎన్నికల్లో వంద మీటర్ల గోతిలో పాతిపెట్టారన్నారు. తన బిడ్డను ఓడగొట్టారని కేసీఆర్ నిజామాబాద్ మీద కక్షగట్టారని ఇక్కడి సమస్యలు పరిష్క రించలేదని ఆరోపించారు.
ALSO READ : జమ్ముూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు సైనికుల వీరమరణం
సీఎంతో పోరాడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాజిరెడ్డి గోవర్ధన్ డీజిల్ అమ్మకాలు, కొనుగోళ్లలో కమీషన్లకు కక్కుర్తి పడి 50 మంది కార్మికులను పొట్టన బెట్టుకున్నాడని విమర్శించారు. నారాయణఖేడ్‌కు చెందిన గిరిజనులు నేటికీ వలస పోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, ఇతర కంపెనీలు ఖేడ్ లో నెలకొల్పి వలసలను నివారిస్తామన్నరు. భూపాల్ రెడ్డిని నవంబర్ 30న ఓటుతో బండకేసి కొట్టాలన్నారు.