మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డికి మద్దతుగా జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనన్నారు. మోడీతో రేవంత్ కు లోపాయికారీ అవగాహన ఒప్పందం ఉందన్నారు. దానిలో భాగమే మార్ఫింగ్ వీడియో ఘటనలో రేవంత్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం కొత్త డ్రామా అని ఫైర్ అయ్యారు.
దమ్ముంటే కవితను అరెస్ట్ చేసినట్టు రేవంత్ ను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. అప్పుడే మోదీ, రేవంత్ ఒక్కటి కాదనేది నిజమని ప్రజలు నమ్ముతారని అన్నారు. మీడియాలో ప్రచారం కోసం , ప్రజలను మోసగించేందుకే రేవంత్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ,కాంగ్రెస్ కుట్రలు ప్రజలకు అర్థమైపోయాయని చెప్పారు.
కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ లు ఎత్తేయడం ఖాయమన్నారు. ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని రేవంతే చెబుతున్నాడని ఆయన తెలిపారు. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల్లో విశేష స్పందన వస్తుందన్నారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో మార్పు తథ్యమన్నారు జగదీశ్ రెడ్డి.