- కొడంగల్‌లో ఓడిన నవ్వు.. ఇక్కడ గెలుస్తవా?: కేటీఆర్
- రేవంత్ ఉద్యమ ద్రోహి అని కామెంట్
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించగానే.. ప్రతిపక్షాల ఫ్యూజులు పోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చి కామారెడ్డిలో పోటీ చేసి గెలువగలడా అని విమర్శించారు. కామారెడ్డి టౌన్, రూరల్, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల పార్టీ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ మంగళవారం సభ నిర్వహించి మాట్లాడారు. సొంత నియోజవర్గం కొడంగల్‌లోనే బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయిన రేవంత్.. ఇప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తాననడం హాస్యాస్పదనమన్నారు. అలా పోటీకి వస్తే కామారెడ్డిలో తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు. ఇక్కడ పోటీ చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోటీ చేయాలా? వద్దా? అని జంకుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఉద్యమ గడ్డ అని, ఇక్కడి సత్తా ఏంటో రేవంత్‌కు చూపిస్తామన్నారు. రేవంత్ ఉద్యమ ద్రోహి అని, కామారెడ్డికి వస్తానంటే గమ్మతుగా ఉందన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్యే శేరి సుభాశ్ రెడ్డి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ముజీబొద్దిన్, స్టేట్ లైబ్రరీ చైర్మన్ శ్రీధర్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, సీనియర్ లీడర్లు వేణుగోపాల్ రావు, పున్న రాజేశ్వర్, నర్సింగ్ రావు, ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరి దృష్టి కామారెడ్డిపైనే..
కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ ప్రకటించిన వెంటనే అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే పడిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్వయంగా కోరారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ దశ తిరిగి పోతుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కేసీఆర్ గెలిచేవారని, కానీ.. ఆయన కామారెడ్డిని ఎంచుకోవడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. మూడోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇక్కడి 22వ ప్యాకేజీ పనులతో పాటు, మద్దిమల్ల నుంచి నీళ్లు తెస్తామని, 6 నుంచి 9 నెలల్లో కామారెడ్డి ప్రజలకు సాగు నీళ్లు అందిస్తామన్నారు. కేసీఆర్ కామారెడ్డికి వస్తే భూములు పోతాయని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కొత్తది రద్దు చేశామని తెలిపారు. కేసీఆర్ గెలుపు కోసం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తా కష్టపడాలని కోరారు. కార్యకర్తలే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు భావించి ఇంటింటా ప్రచారం చేయాలన్నారు.