మోడీ మోసానికి, కేసీఆర్ ధోఖాకు బదులిస్తం: రేవంత్

ఎన్నికల సమయంలో ప్రజలు తీసుకునే నిర్ణయమే రాష్ట్ర భవిష్యత్‭ను మారుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా గర్జన సభకు తరలివచ్చిన ఆడబిడ్డలకు ధన్యవాదాలు తెలిపారు. ఆడబిడ్డలంతా తరలివచ్చి.. తమ ఆత్మ గౌరవాన్ని చాటారని అన్నారు. మోడీ చేస్తున్న మోసం, కేసీఆర్ ధోఖాకు సమాధానం ఇవ్వబోతున్నామని చెప్పారు. కేసీఆర్‭ను వంద మీటర్ల గోతిలో పాతిపెట్టే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రజలను మోసం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. 

కన్నతల్లి లాంటి కాంగ్రెస్‭ను చంపాలని చూస్తున్నాడని రాజగోపాల్ రెడ్డి పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆడబిడ్డలకు పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం, రైతు రుణమాఫీ, దళితులకు భూమి ఇవ్వని కేసీఆర్.. ఎన్నికలు వచ్చే సరికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఓటు ఎలా అడుగుతున్నాడని ప్రశ్నించారు. ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఇప్పుడు అభివృద్ధి పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. మీ ఆడబిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా పాల్వాయి స్రవంతిని గెలిపించండి అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిండు మనసుతో ఆడబిడ్డను ఆశీర్వదించండి అంటూ రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.